సీనియర్ కాంగ్రెస్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇబ్రహీంపట్నంలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలో ఓడిపోయింది.
కనుక గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాలకు ఏకైక ప్రతినిధిగా నిలిచిన మల్‌రెడ్డి రంగారెడ్డికి తప్పక మంత్రి పదవి లభిస్తుందని అందరూ భావించారు. అయితే అప్పటికే పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఇచ్చినందున మిగిలిన వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారు. అందుకే క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
ఇదీగాక లోక్‌సభ ఎన్నికలలోగా గ్రేటర్ పరిదిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. కనుక బిఆర్ఎస్, టిడిపిలతో సహా ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలని కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే బాధ్యతని మల్‌రెడ్డి రంగారెడ్డికి అప్పగించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
ఆయన గతంలో టిడిపిలో పనిచేసినందున గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో నేటికీ సత్సంబంధాలున్నాయి. మల్‌రెడ్డి రంగారెడ్డి నిత్యం ప్రజల మద్యనే ఉంటారు కనుక బిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో కూడా మంచి పరిచయాలున్నాయి. అందుకే ఈ బాధ్యతని ఆయనకి అప్పగించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
మల్‌రెడ్డి రంగారెడ్డి 1981లో టిడిపి ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన మొదట తొర్రూర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 1986లో హైదరాబాద్ డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1994లో మలక్‌పేట టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారి 2004లో మళ్ళీ మలక్‌పేట నుంచి పోటీ చేసి గెలిచారు. గత రెండు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ఈసారి ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి గెలిచారు.