తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత హైకోర్టు భవనాలు శిధిలావస్థకు చేరుకొన్నాయని, కనుక కొత్త భవనాలు నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ రాజేంద్ర నగర్‌లో హైకోర్టు కోసం 100 ఏకరాలలో అత్యాధునిక సదుపాయాలతో భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జనవరిలో శంఖుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
దాదాపు రెండేళ్ళలో కొత్త భవనాల నిర్మాణం పూర్తిచేసి వాటిలోకి హైకోర్టుని తరలిద్దామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైకోర్టు భవనం చారిత్రిక కట్టడమైనందున దానికి పూర్తిగా మరమత్తులు చేసి వేరే అవసరాలకు ఉపయోగించుకొనేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.