మజ్లీస్‌ ఎమ్మెల్యేలతో రేవంత్‌ భేటీ... అందుకేనా?

December 12, 2023


img

మజ్లీస్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలతో సిఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో  ఎమ్మెల్యేలు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో పాతబస్తీ, మూసీ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. అంతకు ముందు వారు సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకొన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అదనంగా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. కనుక వారు బయటకు జారుకొంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం 6-12 నెలలకు మించి మనుగడ సాగించలేదని బిఆర్ఎస్, బీజేపీలు పదేపదే చెపుతున్నాయి.

కనుక రేవంత్‌ రెడ్డి తన ప్రభుత్వానికి మజ్లీస్‌ పార్టీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన్నట్లే భావించవచ్చు. మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకరుగా ఎంచుకోవడంతోనే ఆ ప్రయత్నాలు మొదలైన్నట్లు చెప్పవచ్చు. నేడు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని రేవంత్ రెడ్డిని కలిసేందుకు రావడం కూడా ఆ కోణంలోనే చూడవచ్చు.

ఇండియా కూటమి సమావేశాలకు తమని ఆహ్వానించలేదని అసదుద్దీన్ ఓవైసీ బాధపడ్డారు కూడా. కనుక లౌకికవాద కాంగ్రెస్‌ స్నేహహస్తం అందుకొంటే జాతీయ రాజకీయాలలో కూడా దాని మద్దతు లభిస్తుంది.మజ్లీస్ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ఎంతో కొంత లాభపడుతుందే తప్ప నష్టపోదు.

అయితే ఇప్పటికిప్పుడు మజ్లీస్ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలపకపోయినా ఆ పార్టీ నేతల స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్‌తో కలిసి పయనించే అవకాశం ఉంది. 


Related Post