తెలంగాణ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు బిఆర్ఎస్ ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆయనపై ‘తెలంగాణ వ్యతిరేకి’ ముద్ర వేసి ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నించిందని అందరికీ తెలుసు. పదేళ్ళ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. కనుక ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తూ రాజ్యసభకు పంపాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 2వ తేదీతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ బలంతో ఇద్దరిని రాజ్యసభకు పంపవచ్చు. వారిలో ఒకరు ప్రొఫెసర్ కోదండరామ్ అని తాజా సమాచారం.
ఈరాజకీయాలను పక్కన పెట్టి చూసినా ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నత విద్యావంతుడు, మంచి మేధావి, తెలంగాణ రాష్ట్రం, దేశం సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్నవారు. కనుక పెద్దల సభకు వెళ్ళేందుకు అన్ని విధాలా అర్హులే! ఆయనను పెద్దల సభకు పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికే గౌరవం లభిస్తుంది.