వైసీపిలో రాజీనామాలు... తెలంగాణ ఎన్నికల ఎఫెక్టేనా?

December 12, 2023


img

“తెలంగాణలో ప్రభుత్వం మారితే మాకేమిటి? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకెందుకు? ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మాత్రం మేమే,” అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పి వారం రోజులు కాలేదు. తెలంగాణ ఎఫెక్ట్ ఏపీపై అసలు ఉండదని వైసీపి ఆత్మసాక్షి తీర్మానించి నాలుగు రోజులు కానేలేదు. ఇంతలోనే హటాత్తుగా వైసీపిలో రాజీనామాలు మొదలైపోయాయి. కనుక ఇది తెలంగాణ ఎఫెక్టా కాదా అనేది ఏపీ మంత్రులే చెప్పాలి. 

అమరావతి పరిధిలోని మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పార్టీకి, పదవికి కూడా నిన్న రాజీనామా చేశారు. కొద్ది గంటల వ్యవధిలో విశాఖ రాజధాని పరిధిలోని గాజువాక వైసీపి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, నియోజకవర్గం కోఆర్డినేటర్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు! కొడుకుతో పాటు తండ్రి కూడా పార్టీ మారబోతున్నారని సమాచారం. కనుక వారు రాజీనామాలు చేయగానే వైసీపి అధిష్టానం వెంటనే కొత్త నియోజకవర్గం ఇన్‌చార్జిలను నియమించింది.    

అయినా తెలంగాణలో ప్రభుత్వం మారితే ఏపీ వైసీపిలో రాజీనామాలు దేనికి?అంటే కేసీఆర్‌ అంతటివాడు కాంగ్రెస్‌ గాలికి కొట్టుకుపోతే, ఏపీలో టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే జగన్‌ కూడా కొట్టుకుపోకుండా ఉంటారా?అనే ఆలోచన అప్పుడే వైసీపి నేతల్లో మొదలైన్నట్లే ఉంది.

కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లు చేసుకోక ముందే వైసీపి నేతలు మూటా ముల్లెసర్దుకొని వైసీపి నుంచి బయటపడుతున్నట్లున్నారు. ఇదే నిజమైతే ఈ రాజీనామాలు ఇక్కడితో ఆగేవి కావనే భావించవచ్చు.


Related Post