కేసీఆర్‌ సాయం పొందినవారు మొహం చాటేస్తే.....

December 12, 2023


img

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకొని ప్రస్తుతం హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. అందరి కంటే ఆయనను ముందుగా పరామర్శించిన వారు ఇద్దరే. ఒకరు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి. మరొకరు ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు! 

వారిద్దరినీ కేసీఆర్‌ ఎంత దారుణంగా అవమానించారో, రాజకీయంగా ఎంత దెబ్బ తీశారో అందరికీ తెలుసు. నేటికీ తమను కేసీఆర్‌ అసహ్యించుకొంటున్నారని, అవకాశం చిక్కితే మళ్ళీ చావు దెబ్బతీయడానికి వెనకాడరని రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరికీ తెలుసు. కానీ రాజకీయ శత్రువుల పట్ల కూడా కనీస మర్యాదలు పాటించడం అవసరమని వారిద్దరూ చెప్పకనే చెప్పారు. 

గత ఏపీ ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డి తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి కేసీఆర్‌ తోడ్పడ్డారని అందరికీ తెలుసు. కానీ ఆ విషయం జగన్మోహన్‌ రెడ్డి అప్పుడే మరిచిపోయిన్నట్లున్నారు!

ముఖ్యమంత్రిగా ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఓసారి హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ని పరామర్శించివెళ్ళవచ్చు. కుదరకపోతే తన మంత్రులలో ఎవరో ఒకరిని పంపించవచ్చు. కానీ ఓ ట్వీట్ వేసి ఊరుకొన్నారు. కానీ ఇప్పటికే చాలా మంది ఈ మాట అనేస్తున్నారు. పైగా చంద్రబాబు వెళ్ళి కేసీఆర్‌ని పరామర్శించారు. కనుక నేడో రేపో జగన్మోహన్‌ రెడ్డి కూడా వస్తారేమో?  

ఈ పదవులు, అధికారం శాశ్వితం కావని కేసీఆర్‌ ఇప్పటికే తెలుసుకొన్నారు. ఏపీ సిఎం జగన్‌ కూడా తెలుసుకోవలసి ఉంది. రాజకీయాలలో ఇటువంటి హుందాతనం, కనీస మర్యాదలు పాటించడం నేర్చుకొంటే మంచిది. ఓటుకి నోటు కేసులో కేసీఆర్‌ రేవంత్‌ రెడ్డిని ట్రాప్ చేయించి అరెస్ట్ చేయించి చివరికి ఏం సాధించగలిగారు? చివరికి ఏమైంది. అదేవిదంగా చంద్రబాబుపై కూడా కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి, జైలుకి పంపించి జగన్‌ ఏమి సాధించగలరు? చివరికి ఏమవుతుంది?కాలమే చెపుతుంది. 


Related Post