తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఓ రకమైన స్థబ్దతలో ఉండిపోయారు. అయితే ఎల్లకాలం ఇలాగే ఉండిపోరు కనుక భవిష్యత్ రాజకీయ కార్యాచరణ గురించి కూడా ఆలోచించక తప్పదు. ముందుగా లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించుకోగలిగితేనే మళ్ళీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కానీ ఇప్పుడు అది కూడా చాలా కష్టం కావచ్చు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడం లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు కలిసివస్తుంది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తేనే కేంద్రంలో అధికారంలోకి రాగలదు. కనుక తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి 17కి కనీసం 10-12 సీట్లు సాధించి కాంగ్రెస్ అధిష్టానానికి బహుమతిగా ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయం.
అలాగే శాసనసభ ఎన్నికలలో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ కూడా ఈ అవమానం నుంచి బయటపడాలంటే 17 స్థానాలలో మళ్ళీ తమ 4 స్థానాలైన గెలుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయమే. కనుక లోక్‌సభ ఎన్నికలు కూడా బిఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షగానే మారవచ్చు.