బిఆర్ఎస్‌, కేసీఆర్‌... తర్వాత ఏమిటి?

December 11, 2023


img

నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు క్షణం తీరిక ఉండేది కాదు. బిఆర్ఎస్‌ పార్టీ ఎన్నికలలో ఓడిపోవడంతో ఇప్పుడు ఎవరికీ పనిలేకుండా పోయింది. పైగా తమ అధినేత కేసీఆర్‌ ఆస్పత్రి పాలయ్యారు. మారో రెండు నెలల వరకు రాజకీయాలలో పాల్గొనే అవకాశం లేదు. బిఆర్ఎస్‌ శ్రేణులు ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదు. 

రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘హనీమూన్ పీరియడ్’ 5-6 నెలలు ఉంటుంది. కనుక అది కుదురుకోక మునుపే, దాని పాలన తీరు చూడకముందే దానిపై విమర్శలు, ఆరోపణలు చేయడం రాజకీయ అపరిపక్వత అవుతుంది. శాసనసభ సమావేశాలు మహా అయితే నాలుగు రోజులు జరుగుతాయి. కనుక వాటిలోనూ పెద్దగా మాట్లాడేందుకు అవకాశం ఉండదు. 

ముఖ్య నేతలు ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు కూడా. ఈ నేపధ్యంలో బిఆర్ఎస్‌ పార్టీలో నిశబ్ధం తాండవిస్తోంది. కనుక బిఆర్ఎస్‌ భవిష్య కార్యాచరణ ఏమిటనేది ఆ పార్టీ నేతలు నోరు విప్పి మాట్లాడితే కానీ తెలియదు. ముందుగా పార్టీ ఓటమిపై అంతర్గతంగా విశ్లేషించుకోవలసి ఉంటుంది. లోటుపాట్లు గుర్తించుకొని వాటిని సరిదిద్దుకొని ఏప్రిల్ నెలలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్దం కావలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినందున లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూరిన్నట్లయింది. కనుక కాంగ్రెస్‌ను ఓడించడం ఇంకా కష్టం కావచ్చు.  

పార్టీ ఓటమి నేపధ్యంలో కేసీఆర్‌ జాతీయరాజకీయాలకు దూరంగా ఉంటారా లేక మరింత ఉదృతంగా ముందుకు సాగుతారా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఒకవేళ జాతీయ రాజకీయాలలో ముందుకు సాగాలనుకొంటే ఎప్పటిలాగే కాంగ్రెస్‌, బీజేపీలకు దూరంగా ఉంటారా లేక మోడీ, అమిత్ షాలతో చేతులు కలుపుతారా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు. 


Related Post