లోక్‌సభ ఎన్నికలలో పోటీయా... తెలీదు: ఈటల

December 09, 2023


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి బహిష్కరించిన తర్వాత హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో ఆయనను చిత్తుచిత్తుగా ఓడించి రాజకీయ సమాధి కట్టాలని విఫల ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కోరిక నెరవేరలేదు కానీ శాసనసభ ఎన్నికలలో నెరవేరింది.

గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ చేతిలోనే ఘోరపరాజయం పాలయ్యారు. అంతేకాదు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో తాను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి చేతిలో కూడా ఓడిపోయారు. ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌ గెలిచినప్పుడు, ఆయన చేతిలో పాడి కౌశిక్ రెడ్డి కాక కేసీఆరే ఓడిపోయారని అందరూ భావించారు. కనుక అప్పుడు బీజేపీ అధిష్టానం ఆయనకు చాలా గౌరవం, ఆయన సలహాలకు చాలా విలువ ఇచ్చింది.   

దాంతో ఆయన పిర్యాదులు లేదా సూచన మేరకు బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తొలగించింది. బండి సంజయ్‌ని తొలగింపజేసినప్పుడు బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత ఈటల రాజేందర్‌దే అవుతుంది. కానీ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తుందనుకొన్న బీజేపీ ఓడిపోవడమే కాకుండా పోటీ చేసిన రెండు స్థానాల నుంచి ఆయన కూడా ఓడిపోయారు. కనుక ఇప్పుడు బీజేపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందని చెప్పవచ్చు. 

ఓటమి షాక్ నుంచి తేరుకొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత ఎన్నికలలో బీజేపీ 119 స్థానాలకు పోటీ చేస్తే ఒక్క సీటే గెలుచుకొంది. కానీ ఈసారి 8 సీట్లు గెలుచుకొంది. వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తానో లేదో నేను చెప్పలేను. అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకొంటాను,” అని అన్నారు. 


Related Post