సిఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి ప్రతీ శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలని స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందుకు వీలుగా ప్రజాభవన్ లోనికి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుగా నిర్మించిన ఇనుప గ్రిల్స్, బారికేడ్లను నిన్ననే జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించేశారు. దీంతో ఈరోజు ఉదయం 7-8 గంటల నుంచే వందలాది మంది ప్రజలు ప్రజాభవన్ ఎదుట క్యూకట్టారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. ఇది సదుదేశ్యంతో ప్రారంభించిన మంచి కార్యక్రమమే అయినప్పటికీ, పనుల ఒత్తిడి కారణంగా ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా ప్రతీవారం ప్రజాదర్బార్ నిర్వహించడం చాలా కష్టమవుతుంది. కనుక దీని కోసం ప్రత్యేక యంత్రాగాన్ని, కార్యాలయాన్ని వేరేగా ఏర్పాటు చేయిస్తే నిరంతరంగా కొనసాగించగలుగుతారు. లేకుంటే మద్యలో నిలిపివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది.