కడియంకు అంత తొందరెందుకో?

December 07, 2023


img

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఇంకా ప్రమాణ స్వీకారం చేయక మునుపే ఆయన ప్రభుత్వం పడిపోతుందని, తమ పార్టీలు అధికారంలోకి వస్తాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడటం చాలా దారుణం.  

జనగామ జిల్లాలో కడియం శ్రీహరి నిన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ వద్ద అదనంగా 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనుక ఐదుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేసే ఎమ్మెల్యేలను బిఆర్ఎస్‌ (39), మజ్లీస్‌ (7), వీలైతే బీజేపీ (8)ని కూడా కలుపుకొంటే అప్పుడు మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కనుక కార్యకర్తలందరూ ఓ ఏడాది ఓపిక పట్టాలి,” అని అన్నారు.

కడియం వంటి సీనియర్ నాయకుడు నోట ఇటువంటి మాటలు విస్మయం కలిగిస్తాయి. ఇదివరకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలెన్నుకొన్న తమ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌, టిడిపిలు కూలద్రోయాలని కుట్రలు పన్నుతున్నాయని కేసీఆర్‌ ఆరోపిస్తూ ఆ రెండు పార్టీలను కలిపేసుకొని నిర్వీర్యం చేశారు. గత ఏడాది నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని ఆస్తిరపరిచేందుకు కుట్రలు పన్నుతోందని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా జరిగిన డ్రామాలు అందరూ చూశారు. 

తన ప్రభుత్వాన్ని ఎవరైనా కూలదోసేందుకు ప్రయత్నిస్తే కేసీఆర్‌ దానిని ఘోరాతిఘోరమైన నేరమని వాదించి చాలా తీవ్రంగా స్పందించినప్పుడు, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కడియం శ్రీహరి చెపుతుంటే కేసీఆర్‌ ఆయనను ఎందుకు మందలించ లేదు?ఎందుకు ఖండించడం లేదు?

రేవంత్‌ రెడ్డి కాస్త నిదానంగా బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంగతి చూద్దామనుకొంటే, ప్రభుత్వం కూలిపోతుందంటూ కడియం శ్రీహరి హెచ్చరిస్తున్నారు. ఆయననే రేవంత్‌ రెడ్డిని తొందరపెడుతున్నారు. కనుక మరింకెందుకు ఆలస్యమని రేవంత్‌ రెడ్డి త్వరలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముహూర్తం పెట్టేయడం ఖాయమే. కనుకఈవిదంగా మాట్లాడేవారి వలననే  బిఆర్ఎస్‌ పార్టీ నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post