కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేయడంతో, ఇప్పుడు ఆ రేసు ముగిసిపోయింది. కనుక ఇప్పుడు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నేతల రేస్ మొదలైంది. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు సీనియర్లు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా మాట్లాడి మంత్రి పదవులు సంపాదించుకొందామని ప్రయత్నిస్తున్నారు.
వారిలో దుద్దీళ్ళ శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు తదితరులున్నారు. ముఖ్యమంత్రి పదవి లభించకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ కీలకమైన శాఖలు సంపాదించుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ మంత్రి పదవి లభించడాని చాలామంది భావిస్తుండటంతో అందరూ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం కూడా సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయకుండా వారికీ సముచిత పదవులు, ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయించుకొంది. కానీ మంత్రివర్గంలో గరిష్టంగా 16 మందికి మాత్రమే చోటు ఉంటుంది కానీ 20-25 మందికి పైగా పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి పదవుల పంపకం కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున ప్రతీ ఒక్క ఎమ్మెల్యేని జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది. తమ ప్రభుత్వ ఈ బలహీనత మంత్రి పదవులు ఆశిస్తున్న వారందరికీ కూడా బాగా తెలుసు. కనుకనే వారు నేరుగా అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారనుకోవచ్చు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం కూడా వారందరినీ బుజ్జగించి సర్ది చెప్పేందుకు తిప్పలు పడుతోంది.