రేవంత్‌ రెడ్డి ఇంకా చాలా పోరాటాలు చేయక తప్పదుగా

December 05, 2023


img

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే పార్టీలో సీనియర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. పిసిసి అధ్యక్షుడుగా నియమింపబడినప్పటి నుంచి అది మరింత పెరిగింది. మునుగోడు ఉపఎన్నికల నాటికి అది పరాకాష్టకు చేరింది.

అయినప్పటికీ రేవంత్‌ రెడ్డి ఏనాడూ నిబ్బరం కోల్పోలేదు. వెనకడుగు వేయలేదు. ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్లను భరిస్తూ, మరోవైపు అత్యంత శక్తివంతుడైన కేసీఆర్‌తో, అత్యంత పటిష్టంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీతో ఒంటరిగానే పోరాడారని చెప్పవచ్చు.

అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు తప్ప ఎవరు కోరుకొంటారు? అటువంటి పార్టీని, ఇన్ని సవాళ్ళు, సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు నడిపించడమే ఎంతో కష్టం. రేవంత్‌ రెడ్డి పార్టీని నడిపించడం కాదు పరుగులు పెట్టించారు కూడా!

అధికారంలో లేనప్పుడే పదవుల కోసం కుమ్ములాడుకొంటున్న కాంగ్రెస్‌ నాయకులతో నిండిన పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కలిగించడం అసంభవం. దానినీ రేవంత్‌ రెడ్డి సంభవం చేసి చూపించారు.

ప్రజలకు నమ్మకం కల్పించి బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని నిలపగానే బిఆర్ఎస్ పార్టీ ప్రమాదాన్ని శంకించి ఆయనపై ఎదురుదాడులు చేస్తూనే ఉంది. ఆయన నాయకత్వం పట్ల పార్టీ శ్రేణులకు, ప్రజలకు అపనమ్మకం కలిగించేందుకు బిఆర్ఎస్‌ చేయని ప్రయత్నాలు లేవు.వాటన్నిటినీ తట్టుకొని ఎదురొడ్డి పోరాడుతూనే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించి తన సమర్దతను, నాయకత్వ లక్షణాలను నిరూపించుకొన్నారు.

వడ్డించిన విస్తరి ఉంటే ఎవరైనా భోజనం చేస్తారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి పదవికి పలువురు పోటీ పడ్డారు. మళ్ళీ వారందరితో మరో నిశబ్ధ పోరాటం చేసి దానిలో కూడా రేవంత్‌ రెడ్డి విజయం సాధించారు.

అయితే ఈ పోరాటాలు ఇప్పట్లో పూర్తయ్యేవి కావనే చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన సీనియర్లు మంత్రి పదవులతో సర్దుకుపోయి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను పాటిస్తారనుకోలేము.

ఈ అసంతృప్తి కారణంగా గెలిచిన ఎమ్మెల్యేలలో 4-5 మంది చేజారిపోయినా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక అందరినీ సంతృప్తి పరుస్తూనే ఉండాలి. వీలైతే బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేసి తెచ్చుకొనే ప్రయత్నించక తప్పదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలుచేయడం ఒక్కటి మరో ఎత్తు. వాటి కోసం నిధుల సమకూర్చుకోవడం, ప్రతీ హామీని ఖచ్చితంగా అమలుచేయడం, జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయడం, మరో పక్క పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉద్యోగాల కల్పన, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా… ఒకటా రెండా... సవాలక్ష సవాళ్ళు రేవంత్‌ రెడ్డి కోసం ఎదురుచూస్తున్నాయి.

కనుక రేవంత్‌ రెడ్డికి దక్కింది ముఖ్యమంత్రి పదవి అనుకోవడం కంటే ఓ ముళ్ళ కుర్చీ, ఓ ముళ్ళ కిరీటమని చెప్పవచ్చు. ఇన్ని పోరాటాలు చేసి ఆ ముళ్ళ కుర్చీ, ముళ్ళ కిరీటం గెలుచుకొన్న రేవంత్‌ రెడ్డి, ఇక ముందు కూడా ఆ పోరాటాలు చేస్తూనే ఉండాలి. పదేపదే తమ సమర్దత, నాయకత్వ లక్షణాలను నిరూపించుకొంటూనే ఉండాలి. మరి ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.                       



Related Post