సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ సిఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని, హైదరాబాద్ ఆదాయాన్ని కూడా ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, దానిలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకొన్నారు. ఇక తాను గద్దె దిగక తప్పదని గ్రహించిన కేసీఆర్ ఇంతకాలం ప్రగతి భవన్‌లో దాచిపెట్టిన సుమారు రూ.300-400 కోట్లు నగదుని రహస్యంగా తన సామానుతో కలిపి ఫామ్‌హౌసుకి తరలిస్తున్నట్లు మావద్ద సమాచారం ఉంది.
మేము అధికారంలోకి రాగానే ధరణీ పోర్టల్ రద్దు చేస్తామని చెప్పాము కనుక బిఆర్ఎస్ నేతలందరూ హడావుడిగా తాము కబ్జాలు చేసిన భూములను ధరణీ ద్వారా తమ పేరిట రిజిస్ట్రేషన్స్ చేయించుకొంటున్నారు. మేమేమి గాలి కబుర్లు చెప్పడం లేదు. ఇందుకు మావద్ద ఆధారాలున్నాయి,” అని ఆరోపించారు.
మధు యాష్కీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై బిఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించ వలసి ఉంది. అయితే ఈ ఎన్నికలలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీయే తప్పకుండా గెలిచి అధికారంలో కొనసాగుతుందని సిఎం కేసీఆర్ నమ్మకంగా చెపుతున్నారు. అంతేకాదు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.