ఈసారి శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా వ్యవసాయానికి సంబందించినవే రెండు అంశాలు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విజయావకాశాలను తారుమారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాపై బిఆర్ఎస్ చేస్తున్న వాదనలు కాంగ్రెస్ పార్టీకి, ధరణీ పోర్టల్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలని చెప్పారని, ఇప్పుడు దానిని సమర్ధించుకోవడానికి 1 లేదా 2 హెచ్‌పి మోటర్లకు బదులు 10హెచ్‌పి మోటర్లను పెడతామని చెపుతున్నారని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు రోజుకి 4-5 గంటలు కూడా కరెంట్ సరఫరా చేయలేకపోతున్నప్పుడు తెలంగాణలో మాత్రం చేయగలదా?అంటూ బిఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆలోచింపజేస్తోంది.
అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ కూడా ‘ధరణి పోర్టల్’ కేవలం బిఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు చేసుకొని తమ పేర్లమీద మార్పించుకొనేందుకు, లోపభూయిష్టమైన ధరణీ వలన రాష్ట్రంలో నిరుపేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ చేస్తున్న వాదనలు రైతులను ఆకట్టుకొంటున్నాయి.
అందుకే కాంగ్రెస్ నేతలు ధరణీ పోర్టల్ రద్దు చేసి దాని స్థానంలో ‘భూ భారతి’ పోర్టల్ ప్రవేశపెడతామని చెపుతుండగా, బీజేపీ కూడా కాంగ్రెస్ వాదనలు అందిపుచ్చుకొని, తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించింది. మరోపక్క ధరణీ పోర్టల్ తెలంగాణ రైతన్నల పాలిట వరమని, దానిని రద్దు చేస్తే రైతన్నలు తీవ్రంగా నష్టపోతారని సిఎం కేసీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. కనుక ఒకవేళ ధరణి పోర్టల్ పట్ల రైతన్నలు నష్టపోతున్నట్లయితే అదే బిఆర్ఎస్ పార్టీ కొంపముంచవచ్చు.