తెలంగాణ శాసనసభ ఎన్నికలే వేలకోట్ల ఖరీదైన వ్యవహారమనుకొంటే, మూడు ప్రధాన పార్టీలు ఇస్తున్న హామీలు లక్షల కోట్లు దాటిపోతున్నాయి. రూ.400లకే గ్యాస్ సిలిండర్, 18 ఏళ్ళు నిండిన విద్యార్ధినులకు ఎలక్ట్రిక్ బైకులు, నెలకు రూ.5,000 పింఛన్లు, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఒకటేమిటి... అనేక హామీలు అన్ని పార్టీలు పోటీ పడుతూ ప్రకటిస్తున్నాయి. మరి వీటన్నిటికీ నిధులు ఎలా సమకూర్చుకొంటాయి? అంటే ఛార్జీలు, ఇంటిపన్నులు వగైరాలు పెంచి ప్రజల నుంచే సమకూర్చుకొంటాయని వేరే చెప్పక్కరలేదు.
కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా అనేక హామీలు గుప్పిస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీ కూడా దానితో పోటీ పడక తప్పడం లేదు. తాజాగా ‘సౌభాగ్యలక్ష్మి’ అనే మరో కొత్త పధకాన్ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “ఇంతకాలం అత్తమ్మలకు మాత్రమే పింఛన్ ఇస్తున్నామని కోడలు పిల్లలు మాపై అలుగుతున్నారు. కనుక డిసెంబర్ 3న బిఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ‘సౌభాగ్యలక్ష్మి’ పధకంలో వారికీ నెలకు రూ.3,000 పింఛన్ అందిస్తాము. కోడలుకి పింఛన్ ఇస్తే అత్తమ్మ కూడా మా నుంచి ఏదో ఆశిస్తుంది. ఇప్పటి వరకు నెలకు రూ. 2,000 ఆసరా పింఛన్ అందిస్తున్నాము. దానిని దశలువారీగా పెంచుతూ నెలకు రూ.5,000 చొప్పున అందరికీ ఇస్తాము,” అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.