కరీంనగర్‌లో గంగుల కమలాకర్ (బిఆర్ఎస్), బండి సంజయ్ (బీజేపీ), పురుమళ్ళ శ్రీనివాస్ (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు. ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్యనే పోటీ ప్రధానంగా సాగుతున్నప్పటికీ, కరీంనగర్‌లో మాత్రం బిఆర్ఎస్, బీజేపీల మద్య సాగుతోంది. బండి సంజయ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం.
ఈ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్‌పై కొన్ని అవినీతి ఆరోపణలు చేశారు. కానీ అదే పెద్ద పొరపాటు అయ్యిందని చెప్పవచ్చు. అదే... ఆయన మరో అంశంపై విమర్శలు చేసినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కనుక గంగుల ఆరోపణలకు బండి సంజయ్ నుంచి చాలా ఘాటుగానే జవాబు వచ్చింది.
బండి సంజయ్ ఈరోజు కరీంనగర్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ, “నేనేమైనా గంగులలాగ కొండలు, గుట్టలు మింగేశానా?లేక పేదల ఇళ్ళు కూల్చి భూకబ్జాలు చేశానా?లేదు కదా?నేనే అవినీతి పరుడినైతే బీజేపీ నన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించేదా?ఈ ఎన్నికలలో నాకు టికెట్ ఇచ్చేదా?నేను ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. పార్టీ, ప్రజల కోసమే పనిచేశాను. అందుకే మా అధిష్టానం నా సేవలు తెలంగాణ అంతటా బీజేపీకి అవసరమని హెలికాఫ్టర్ ఇచ్చి మరీ నాచేత ప్రచారం చేయిస్తోంది.
కానీ కారు పార్టీలో, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ని మించిన అవినీతిపరుడు లేడు. ఆయనను హైదరాబాద్ రానిస్తే అక్కడా కొండలు, గుట్టలు మాయం చేస్తారని, భూములు కబ్జాలు చేస్తారనే కదా కరీంనగర్ దాటకుండా కేసీఆర్ కట్టడి చేశారు కదా?
అందుకే ఐటి, ఈడీ శాఖలు కూడా ఆయన ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేశాయి. అవినీతికి మారుపేరైన గంగులా... నా గురించి మాట్లాడుతున్నారు? ఆయనకు ఈసారి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు,” అని బండి సంజయ్ అన్నారు.