తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌ గేమ్ చేంజర్‌: జాబ్ క్యాలండర్?

November 17, 2023


img

తెలంగాణ కాంగ్రెస్‌ తన అమ్ముల పొదిలో నుంచి ఈరోజు బ్రహ్మాస్త్రం తీసి సందించింది. అదే జాబ్ క్యాలండర్! తమ పార్టీలో అధికారంలోకి వస్తే మొత్తం 13 కేటగిరీలలో ఉద్యోగాల భర్తీకి నిర్ధిష్టమైన సమయాన్ని, గడువుని కూడా జాబ్ క్యాలండర్‌లో నేడు ప్రకటించింది.

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మ్యానిఫెస్టోలో ఈ జాబ్ క్యాలండర్‌ను కూడా జోడించింది. దీంతో మొత్తం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఆరు నెలల్లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది.

దీనితో పాటు వివిద వర్గాల ప్రజలకు అనేక హామీలు ప్రకటించింది. అయితే వీటన్నిటిలో ఈ జాబ్ క్యాలండర్ ఈ ఎన్నికలలో ‘గేమ్ చేంజర్‌’గా మారి కాంగ్రెస్‌కు విజయాన్ని ప్రసాదించే అవకాశం కనిపిస్తోంది. 

ఎందుకంటే, కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి దాదాపు రెండేళ్ళు అవుతున్నప్పటికీ, ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తవలేదు. పైగా ఎన్నికల తర్వాత కూడా ఇంకా కొనసాగబోతోంది.

ముఖ్యంగా టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలుసు. ఆ కారణంగా పరీక్షలు రద్దు, వాయిదా పడటం, ఒకే పరీక్షను రెండుమూడు సార్లు వ్రాయాల్సి రావడంతో అభ్యర్ధులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

నిర్ధిష్టమైన గడువు ఏదీ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొంటూ ఎన్నికల వరకు సాగదీసి వాటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ రాజకీయ మైలేజీ పొందాలని ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే  ఉన్నాయి.

కనుక నిర్ధిష్టమైన సమయం, గడువుతో కాంగ్రెస్‌ ప్రకటించిన ఈ జాబ్ క్యాలండర్‌తో రాష్ట్రంలో నిరుద్యోగ యువత కనెక్ట్ అయితే విజయం కాంగ్రెస్ పార్టీదే అవుతుందని భావించవచ్చు.         



Related Post