తెలంగాణ కాంగ్రెస్‌లో అతిపెద్ద సమస్య పలువురు సీనియర్లు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతుండటమే. వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధూ యాష్కీ గౌడ్ తదితరులున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఇంతవరకు వారి మాటలపై స్పందించలేదు.
తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని స్వయంగా చెప్పుకోలేదు. కానీ ఇటీవల ఆలంపూర్ సభలో ఆయన సన్నిహితుడుగా పేరొందిన సంపత్ కుమార్ మాట్లాడుతూ, “ఎవరెన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ,” రేవంత్ రెడ్డి సమక్షంలోనే ప్రకటించేశారు.
ఇవాళ్ళ నిర్మల్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ అయిపోయారు. “డిసెంబర్ 9వ తేదీన మీరందరూ కోరుకొంటునట్లుగా నేను బాధ్యతలు చేపట్టబోతున్నాను. వెంటనే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాను,” అని ప్రకటించారు.
అయితే ‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాను’ అని స్పష్టంగా చెప్పలేదు. చెపితే కాంగ్రెస్‌లో సీనియర్లతో వెంటనే సమస్యలు మొదలైపోతాయి. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొన్నప్పుడు, ఎటువంటి గొడవలు మొదలైనా అందరూ నష్టపోతారు. అందుకే రేవంత్ రెడ్డి ‘బాధ్యతలు చేపట్టడానికే’ పరిమితం అయ్యారనుకోవచ్చు.