వేములవాడ బీజేపీ అభ్యర్ధిగా పోటీకి సిద్దమైన ఆ పార్టీ సీనియర్ నాయకురాలు తుల ఉమ, నిన్న నామినేషన్ వేసేందుకు సిద్దపడుతున్నప్పుడు పార్టీ అధిష్టానం తనకు బదులు వికాస్ రావుకి బీ-ఫారం ఇవ్వడంతో తీవ్ర మనస్తాపం చెందారు.
ఆ బాధ నుంచి కాస్త తేరుకొన్న తర్వాత శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నాకు టికెట్ ఇచ్చామని ప్రకటించి ఇప్పుడు వేరే వాళ్ళకి బీ-ఫారం ఇచ్చాక నన్ను బుజ్జగిస్తారట! వాళ్ళకు నా దగ్గరకు వచ్చి మాట్లాడే దమ్ముందా?చెప్పుతో కొడతా? అయినా ఏ మొహం పెట్టుకొని నా దగ్గరకొస్తారు?ఈ నియోజకవర్గంలో వేరెవారికైనా పోటీ చేసే ధైర్యం ఉందా?బండి సంజయ్ దొరల పాలన అంతమొండిస్తామని చెపుతుంటారు. కానీ మళ్ళీ వెళ్ళి ఆ దొరల కాళ్ళ మీదనే పడి బాంచన్ మీ కాల్మోక్తా అంటూ వేడుకొన్నాడు. బీ-ఫారం తీసుకెళ్ళి దొరల కాళ్ళ వద్ద పెట్టి బీసీల పరువు తీశారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను చివరి నిమిషంలో తప్పించడానికి బండి సంజయే కారణమని తుల ఉమ ఆరోపించారు. వేములవాడలో తన సహాయసహకారాలు లేకుండా బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వికాస్ రావు ఎలా గెలుస్తాడో చూస్తానని ఆమె సవాలు విసిరారు.