తెలంగాణ ప్రభుత్వంలో ఐపిఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, బీఎస్పీలో చెరీ గత రెండేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నించారు.
ఆ సభలలో ‘తెలంగాణలో మన పార్టీయే అధికారంలోకి రాబోతోంది. మన పార్టీ చిహ్నామైన ఏనుగుపై బహుజనులు కూర్చొని ప్రగతిభవన్ గేట్లు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించబోతున్నామని నమ్మకంగా చెప్పేవారు. కానీ అది అంత తేలిక కాదని, ఎన్నికలు వందలు, వేల కోట్ల డబ్బుతో ముడిపడున్న ఖరీదైన వ్యవహారమని, కనుక పార్టీ, సిద్దాంతాలు, బహుజనులకు రాజ్యాధికారం వంటి పదాలేవీ ఎన్నికలలో ఉపయోగపడవని ప్రవీణ్ కుమార్ గ్రహించిన్నట్లే ఉన్నారు.
అందుకే ఆయన ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని మేము పోరాడుతున్నాము. అందుకే 107 స్థానాలలో పోటీ చేయబోతున్నాము. అయితే ఈ ఎన్నికలలో గెలిచి మేము అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ మా పార్టీ తప్పకుండా డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది,” అని అన్నారు. అంటే అప్పుడే ఓటమిని అంగీకరించి కొన్ని సీట్లు గెలుచుకొన్నా చాలని ఆశపడుతున్నారన్న మాట!
ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికల వరకు ఎవరు ఎన్ని సిద్దాంతాలైనా చెప్పవచ్చు. ప్రజలు కూడా వచ్చి చప్పట్లు కొడతారు. కానీ ఎన్నికల గంట మ్రోగిన తర్వాత డబ్బు, మద్యం, అంగబలం, ఎన్నికల వ్యూహాలు మాత్రమే ఉపయోగపడతాయని ప్రవీణ్ కుమార్ బాగానే అర్దం చేసుకొన్నారు.