మునుగోడులో కాంగ్రెస్‌ని కాంగ్రెసే ఓడించుకొంటుందిలే

November 06, 2023


img

కాంగ్రెస్‌ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవాళ్ళ మునుగోడు ఎన్నికల సభలో చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నికలు తెచ్చిపెట్టి, కాంగ్రెస్‌ ఓటమికి కారకుడవైన నువ్వు మళ్ళీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా వచ్చి ఓట్లు ఎలా అడుగుతావు? కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన నీ కోసం మేమేందుకు పనిచేయాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిలదీశారు. కొందరు వేదికపైకి దూసుకువచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు వేదిక ఎదురుగా నిలుచోని నినాదాలు చేశారు. 

దీంతో సహనం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ “మీ సహాయసహకారాలు నాకేమీ అక్కరలేదు. ముందు మీరందరూ ఇక్కడి నుంచి పొండంటూ,” ఓ కార్యకర్తని వేదికపై నుంచి బలవంతంగా కిందకు దింపేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ కార్యకర్తలు “రాజగోపాల్ రెడ్డి.... నువ్వు మాకు అక్కరలేదు... గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. 

ఇంతకాలం రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నందున సీనియర్ కాంగ్రెస్‌ నేత చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి ఇద్దరూ మునుగోడు నుంచి పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. కానీ రాజగోపాల్ రెడ్డి హటాత్తుగా కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చి, మళ్ళీ ముంగోడు టికెట్‌ దక్కించుకోవడంతో వారిరువురూ తీవ్ర నిరాశ చెందారు.రేవంత్‌ రెడ్డి కూడా ఆయన రాకను వ్యతిరేకించారు.

కనుక మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ని ఓడించగా, ఈసారి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కలిసి రాజగోపాల్ రెడ్డిని ఓడించడం, బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడం రెండూ ఖాయంగానే కనిపిస్తున్నాయి. 


Related Post