తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రెండు జాబితాలలో కలిపి 100 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేయడంతో ఇంకా పార్టీలో ఆశావాహులకు తలుపులు మూసేసిన్నట్లయింది. పైగా నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం (నవంబర్ 3-10) కూడా దగ్గర పడుతుండటంతో ఇక ఎట్టి పరిస్థితిలో తమకు టికెట్స్ లభించవని గ్రహించిన కాంగ్రెస్ నేతలు, అలకపాన్పులు ఎక్కే ఆలోచన చేయకుండా నేరుగా పార్టీకి రాజీనామాలు చేసి స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి (జూబ్లీహిల్స్), ఎర్ర శేఖర్ (జడ్చర్ల లేదా నారాయణ పేట), నాగేశ్ రెడ్డి (నిజామాబాద్ రూరల్), వడ్డేపల్లి సుభాష్ రెడ్డి (ఎల్లారెడ్డి), చల్లా కృష్ణారెడ్డి (మునుగోడు), గొట్టిముక్కల వెంగళ రావు (కూకట్‌పల్లి), కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ తదితరులలో కొందరు పార్టీకి రాజీనామాలు చేయగా మరికొందరు నేడోరేపో రాజీనామాలు చేయనున్నారు. దాదాపు వీరందరూ స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు.