తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె లక్ష్మణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని కోరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వారు తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల గురించే చర్చించిన్నట్లు సమాచారం.
ఈసారి శాసనసభ ఎన్నికలలో జనసేన 32 స్థానాలలో పోటీ చేసేందుకు సిద్దపడింది. ఆ స్థానాలలో వెనక్కు తగ్గలేమని పవన్ కళ్యాణ్ సున్నితంగా చెప్పేశారు. బీజేపీ ఇప్పటికే 52 స్థానాలకు అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. వాటిలో జనసేన పోటీ చేయాలనుకొన్న స్థానాలు కూడా ఉన్నాయి.
రెండో జాబితాలో కూడా జనసేన కోరిన సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించడం కష్టమే. కనుక నాలుగైదు సీట్లతో సరిపెట్టుకోమని కోరవచ్చు. కానీ ప్రతీసారి బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేయడమే తప్ప జనసేన కోసం బీజేపీ ఏమీ చేయలేదు. కనీసం ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నా కలిసి పనిచేయడం లేదు.కనుక టిడిపితో కలిసి పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు.
ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని తక్షణం జైలు నుంచి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరి ఉండవచ్చు. అందుకు ఆయన అంగీకరిస్తే, తెలంగాణలో కనీసం 10-15 సీట్లు అయినా జనసేనకు కేటాయించేందుకు ఆయన అంగీకరిస్తేనే శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే బీజేపీ ఒంటరి పోరాటం చేయక తప్పదు.