కేసీఆర్‌ వద్దనుకొన్న టిఆర్ఎస్ ఇప్పుడు వేరేవారి చేతిలో!

October 20, 2023


img

ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్‌, తెలంగాణ, టిఆర్ఎస్ ఈ మూడు పేర్లు ఒకదానికొకటి ముడిపడే ఉంటాయి. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచనతో తమకు ఎంతో గుర్తింపు తెచ్చిన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకొన్నారు.

తమ రాజకీయ ఎదుగుదలకి, గుర్తింపుకి నిదర్శనంగా నిలిచే టిఆర్ఎస్ పేరును మార్చాలనే ప్రతిపాదనను పార్టీలోనే అనేకమంది నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించిన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్‌ నిర్ణయాన్ని అందరూ శిరసావహించక తప్పలేదు. 

కేసీఆర్‌ వద్దనుకొన్న ఆ టిఆర్ఎస్ బ్రాండ్ ఇమేజిని సిద్ధిపేట జిల్లా పొన్నాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు తుపాకుల బాలరంగం కావాలనుకొన్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాలలోని మరికొందరు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితి (టిఆర్ఎస్)ని ఏర్పాటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. 

వారి పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదం తెలపడమే కాకుండా ఎన్నికల చిహ్నంగా ‘గ్యాస్ సిలిండర్’ను కేటాయించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు పోటీ చేస్తుందని తుపాకుల బాలరంగం చెప్పారు. 

పార్టీకి టిఆర్ఎస్ పేరు లభించడం ప్లస్ పాయింటే కావచ్చు. కానీ ఎన్నికలలో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ధాటిని తట్టుకొని నిలబడగల అభ్యర్ధులు ఇంకా అవసరం. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో భుజంభుజం కలిపి పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ అంతటివాడే కేసీఆర్‌ ధాటికి తట్టుకోలేక ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పేశారు. మరి ఎన్నికలకు నెలరోజుల ముందు టిఆర్ఎస్ పేరుతో బాలరంగం బరిలో దిగితే నిలబడగలరా? అంటే కాదనే అర్దమవుతోంది. కనుక బిఆర్ఎస్ పార్టీకి వేయబోయి పొరపాటున టిఆర్ఎస్ పార్టీకి పడే ఓట్లతోనే సంతృప్తి చెందాల్సి వస్తుందేమో?


Related Post