తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా పదవుల కోసం ఎప్పుడూ కీచులాడుకోంటూనే ఉంటారని అందరికీ తెలుసు. ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు దగ్గర పడినప్పుడు అందరూ కలిసి కూర్చొన్న కొమ్మనే నరుక్కొంటున్నట్లు ప్రవర్తిస్తుంటారు. గాంధీ భవన్ వద్ద టికెట్ల కోసం ధర్నాలు, పొన్నాల రాజీనామా ఇందుకు తాజా ఉదాహరణలు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. రాగానే రాష్ట్రంలో బెల్టు షాపులన్నీ మూయించేస్తాము. కాంగ్రెస్‌లో ఇద్దరు ముగ్గురం సిఎం క్యాండిడేట్స్ ఉన్నాము. ఎవరు ముఖ్యమంత్రిగా చేపట్టినా బెల్టు షాపులు మూయించేస్తాము,” అని అన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెపుతున్నట్లు అర్దమవుతూనే ఉంది. మరి పార్టీని ముందుండి నడిపిస్తున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంగతి ఏమిటి? తాను కూడా రేసులో ఉన్నానంటూ పాదయాత్రలు చేసిన భట్టి విక్రమార్క సంగతి ఏమిటి?అంటే కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చాక వీరందరూ ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకోబోతున్నారని అర్దమవుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు ఎన్నికలకు ముందు ఈవిదంగా మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుంటే, వారు కాంగ్రెస్ పార్టీని ఎలా నమ్మగలరు? ఎందుకు ఓట్లేస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నేతలే ఓడించుకొంటారనే అపవాదు నిజమేనని చెపుతున్నారనుకోవాలేమో?