హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈసారి శాసనసభ ఎన్నికలలో గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసి కేసీఆర్‌ని ఓడిస్తానని శపధం చేశారు. దానిపై మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ, “కేసీఆర్‌ని ఓడించగలనని ఈటల రాజేందర్‌కు అంతా నమ్మకం ఉంటే, గజ్వేల్ ఒక్క చోట నుంచే పోటీ చేయాలని సవాలు విసురుతున్నాను. కానీ ఆయన హుజూరాబాద్‌లో కూడా పోటీ చేస్తానని ఎందుకు చెపుతునారు?
గజ్వేల్లో గెలుస్తాననే నమ్మకం లేకనా? కేసీఆర్‌ని చూసి భయపడుతున్నారా?ఈసారి ఎన్నికలలో ఈటల రాజేందర్‌ని రెండు చోట్ల మేమే ఒడిస్తాము. ఆయనతో పాటు బీజేపీలో అందరినీ ఒడగొడతాం. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఖచ్చితంగా చెపుతున్నా,” అని అన్నారు.
గంగుల అడిగిన ప్రశ్ననే ఈటల రాజేందర్ కూడా తిరిగి అడుగుతున్నారు. “ఈసారి నేను గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పగానే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. హుజూరాబాద్‌లో నా చేతిలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌కు భయం పుట్టిందా? కేసీఆర్‌కు దమ్ముంటే ఒక్క గజ్వేల్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి నన్ను ఎదుర్కోవాలని సవాలు విసురుతున్నాను,” అని ఈటల రాజేందర్ అంటున్నారు.
అయినా కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు, ఈటల రాజేందర్ రెండు నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని మంత్రి గంగుల ఎలా ప్రశ్నించగలరు? ఈటల రాజేందర్‌కు సవాలు విసురుతున్నప్పుడు, ఆయన విసిరుతున్న సవాలును కూడా కేసీఆర్ స్వీకరించాలి కదా?