సింగరేణి బొగ్గుగనుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైనందున సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసి అభ్యర్ధించడంతో ఈ నెల 28న నిర్వహించాల్సిన సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు నేడు తీర్పు చెప్పింది. నవంబర్ 30వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్దం చేయాలని హైకోర్టు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది.
సింగరేణి ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు భారీగా తాయిలాలు పంచిపెట్టి వారిని ప్రలోభపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తోందని కనుక శాసనసభ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాతే సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర సంఘాలు కోరుతున్నాయి.
ఈ ప్రలోభాల కారణంగా సింగరేణి ఎన్నికలలో బిఆర్ఎస్ అనుబంద కార్మిక సంఘం గెలిచిన్నట్లయితే, ఆ ప్రభావం శాసనసభ ఎన్నికల ఓటింగ్, ఫలితాలపై కూడా ఉంటుందని కాంగ్రెస్, బీజేపీలు ఆందోళన చెందాయి.
కానీ చివరికి అవి కోరుకొన్నట్లుగానే శాసనసభ ఎన్నికల ఫలితాలు (డిసెంబర్ 3) వెలువడిన మూడు వారాల తర్వాత సింగరేణి ఎన్నికలు జరుగబోతున్నాయి. శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే సింగరేణి ఎన్నికలలో కూడా అదే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది.