పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకి ముహూర్తం ఇప్పుడా?

October 02, 2023


img

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం మహబూబ్ నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో నిజామాబాద్ జిల్లాలో జాతీయ జాతీయ పసుపు బోర్డు, ములుగు జిల్లాలో రూ.900 కోట్లు వ్యయంతో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. 

ఏపీలో కృష్ణపట్నం పోర్ట్ నుంచి హైదరాబాద్‌ వరకు గ్యాస్, పెట్రోల్ తదితర ఉత్పత్తులను తరలించేందుకు రూ.1,932 కోట్లు వ్యయంతో మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. 

నాగ్‌పూర్-తెలంగాణ-విజయవాడ కారిడార్ 8 ఆర్ధిక మండళ్ళు, 5 మెగా ఫుడ్ పార్కులు, 4 ఫిషింగ్ క్లస్టర్లు, 3 ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్ టైల్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. 

మొత్తం రూ.13,545 కోట్లు విలువైన ఈ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎప్పటిలాగే కేసీఆర్‌ కుటుంబపాలన, మజ్లీస్‌తో అనుబంధం గురించి విమర్శలు గుప్పించారు. 

గత ఎన్నికలలో నిజామాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తనను గెలిపిస్తే ఎంపీ అయిన నెల రోజులలో జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు బాండ్ పేపర్ మీద సంతకం చేసి మరీ హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. 

అంతకు ముందు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా దీని కోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చారు కానీ కేంద్రం అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పసుపు బోర్డు ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించారు. పదేళ్ళుగా ఇద్దరు ఎంపీలు అడుగుతున్నా మంజూరు చేయనిది, సాధ్యం కాదన్నది ఇప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నారు?

అలాగే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగిన కేంద్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రధాని స్వయంగా మంజూరు చేశారు. త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇపుడు ప్రకటించిన్నట్లు అర్దమవుతూనే ఉంది.         


Related Post