కాంగ్రెస్‌కు గడువు 30వరకే: షర్మిల

September 26, 2023


img

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ముఖ్య ప్రకటన చేశారు. ఈ నెల 30లోగా కాంగ్రెస్‌ అధిష్టానం తమ పార్టీ విలీనంపై నిర్ణయం ప్రకటించాలని లేకుంటే వచ్చే ఎన్నికలలో వైఎస్సార్‌టీపీ మొత్తం 119 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించి ఒంటరిగా పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 

ఆమె ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి పోటీ చేయాలనుకొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తనకు పాలేరు సీటు, తన అనుచరులకు మరో ఆరు సీట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే అసలు తెలంగాణ కాంగ్రెస్‌కు ఆమె అవసరమే లేదని రేవంత్‌ రెడ్డి మొదటే తేల్చిచెప్పారు. ఇటీవల మళ్ళీ ఈ విలీనం ప్రతిపాదనపై చర్చ జరిగినప్పుడు కూడా రేవంత్‌ రెడ్డి, రేణుకా చౌదరి తదితర సీనియర్లు ఆమె చేరికను వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆమెను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్ని అధిష్టానం భావిస్తున్నట్లయితే, శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత చేర్చుకోవాలని సూచించిన్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ ఆమెను ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్‌లో చేర్చుకొని, ఆమె కోరిన్నట్లు సీట్లు కూడా ఇచ్చిన్నట్లయితే, అది బిఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మారుతుందని, కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బ తింటాయాని వారు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అందువల్లే కాంగ్రెస్‌ పెద్దలందరూ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం హైదరాబాద్‌ వచ్చినప్పటికీ, ఆమె కాంగ్రెస్‌లో చేరలేదు. విలీనం జరుగలేదు. 

కాంగ్రెస్‌ ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం వలన ఆమె రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక ఆమె ఈ నెల 30 గడువు విధించిన్నట్లు భావించవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమె చేరికను సీనియర్లు తీవ్రంగా వ్యతికిస్తున్నందున విలీనం జరుగుతుందా లేదా? అనేది సస్పెస్‌గా మారింది. ఆ సస్పెన్స్‌కు 30న ముగింపు పలకాలని ఆమె సిద్దమయ్యారు. మరి చివరికి ఈ వ్యవహారం ఏమవుతుందో, ఏవిదంగా ముగుస్తుందో చూడాలి. 


Related Post