మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో 33శాతం సీట్లు కేటాయించేందుకు నిర్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్ బిల్లు)పై గురువారం రాజ్యసభలో కూడా సుదీర్గంగా చర్చించిన తర్వాత ఆమోదం తెలిపింది. దీనిపై చర్చలో 215 మంది సభ్యులు పాల్గొనగా అందరూ బిల్లుకి మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దాంతో బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు శాసనసభలో బిల్లుకి ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేయడంతో ఇది అమలులోకి వస్తుంది. దేశంలో దాదాపు అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి కనుక రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా లాంఛనప్రాయమే అని భావించవచ్చు. ఈ చట్టం ద్వారా మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు 15 ఏళ్ళపాటు అమలులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం బిల్లులోనే పేర్కొంది. ఆ తర్వాత అప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వం దీనిపై తగిన నిర్ణయం తీసుకొంటుందని తెలిపింది.
ఈ చట్టాన్ని తక్షణం అమలుచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా పలువురు డిమాండ్ చేశారు. అయితే జనగణన చేసి పెరిగిన దేశ జనాభాను బట్టి నియోజకవర్గాల పునర్విభజన జరపకుండా దీనిని అమలుచేయడం సరికాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగవలసి ఉండగా, మహిళా రిజర్వేషన్ బిల్లుకి రాజ్యసభ కూడా ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్ నిరవదికంగా వాయిదా పడింది. బహుశః 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావచ్చు.