ప్రత్యేక సభతో పవన్ కళ్యాణ్ సాధించేదేమిటి?

October 24, 2016


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కాకినాడలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సభ ద్వారా ఆయన నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించలేదు. యధాప్రకారం భాజపాని, ఎంపిలని విమర్శించడంతోనే సరిపెట్టేశారు. ఆ సభలో ప్రత్యేక హోదా కోసం తాము ఏవిధంగా ముందుకుసాగాలో పవన్ కళ్యాణ్ కార్యాచరణ ప్రకటిస్తారని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తే, “మీరందరూ మీ మీ పనులు చూసుకోండి. మన ఎంపిలే దాని గురించి పోరాడుతారు. వారివల్ల కాదని చెప్పేస్తే అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అని సింపుల్ గా తేల్చి పడేశారు. అది విని అభిమానులు చాలా నిరాశ చెందారనే మాట వాస్తవం. 

మళ్ళీ నవంబర్ 10వ తేదీన ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన మీడియాకి ఈరోజు వచ్చింది. ఒక స్మాల్ బడ్జెట్ సినిమా చూడటానికి వెళుతున్నప్పుడు ప్రేక్షకులు ఎటువంటి ‘ఎక్స్ పెక్స్ టేషన్స్’ లేకుండా ఏవిధంగా వెళుతుంటారో, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి చూసిన తరువాత ఆయన అభిమానులు కూడా ఆయన నిర్వహించబోతున్న ఈ సభకి ఎటువంటి ‘ఎక్స్ పెక్స్ టేషన్స్’ లేకుండా, కేవలం తమ అభిమాన హీరో ‘లైవ్ షో’ చూడటానికే తరలి వెళ్ళవచ్చు. ఏపి భవిష్యత్ ని చాలా ప్రభావితం చేయగల ఒక అతిముఖ్యమైన అంశంపై ఆయన నిర్వహిస్తున్న సభకి, ప్రజలు..అదే అభిమానులు ఇటువంటి ఆలోచనలతో తరలిరావడం ఆహ్వానించదగ్గ పరిణామమేనా? పవన్ కళ్యాణ్ ఆలోచించుకొంటే బాగుంటుంది.


Related Post