కొడుకు మంచోడే..తమ్ముడు మంచోడే కానీ

October 24, 2016


img

యూపిలో సమాజ్ వాదీ పార్టీ అధినేత మూలాయం సింగ్ నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం లక్నోలో జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి అఖిలేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ వర్గాల కార్యకర్తలు రోడ్డుపై కొట్టుకొన్నారు. అఖిలేష్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని శివపాల్ వర్గం,  శివపాల్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అఖిలేష్ వర్గం ఫోటోలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సమావేశం జరుగుతున్న ప్రదేశానికి సమీపంలో గొడవ పడ్డారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.

ములాయం, అఖిలేష్, శివపాల్, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అందరూ హాజరైన ఆ సమావేశం కూడా అఖిలేష్, శివపాల్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో రసాబాసగా మారింది. ఈ సమావేశంతో అందరిమద్య రాజీ కుదిర్చి పరిస్థితి చక్కదిద్దుదామని ములాయం అనుకొంటే, ఆయన ఎదుటే తమ్ముడు శివపాల్, కొడుకు అఖిలేష్ తీవ్ర వాదోపవాదాలు చేసుకొంటుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినట్లు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కొందరు ములాయం సమక్షంలోనే అఖిలేష్, శివపాల్ యాదవ్ లకి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరునినాదాలు చేసినట్లు తెలుస్తోంది. 

అఖిలేష్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకోబోతున్నట్లు అతనే స్వయంగా తనకి చెప్పాడని శివపాల్ యాదవ్ గట్టిగా వాదిస్తే, అది అబద్ధమని అఖిలేష్ వాదించాడు. తను తండ్రిని, పార్టీని ఎన్నడూ విడిచిపెట్టిపోనని, కావాలంటే తక్షణమే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసేస్తానని, తనకి నచ్చినవారిని ఆ పదవి ఇచ్చుకోవచ్చని అఖిలేష్ యాదవ్ అన్నారు. 

తనకి శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ఇద్దరూ తమ్ముళ్ళుగానే భావిస్తానని కనుక వారిని ఎట్టి పరిస్థితులలో దూరం చేసుకొనే ప్రసక్తే లేదని ములాయం సింగ్ తేల్చి చెప్పారు. అదేవిదంగా అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ఆలోచన కూడా చేయనని స్పష్టం చేశారు. 

తనకంటే తన తండ్రికి తమ్ముడు, బయట నుంచి వచ్చిన అమర్ సింగే ముఖ్యమని తేల్చి చెప్పడంతో అఖిలేష్ యాదవ్ ఆగ్రహంతో సమావేశంలో మధ్యలో లేచి వెళ్ళిపోయారు. 

ఈ సందర్భంగా ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ “ఈ పార్టీని నిర్మించి ఈ స్థాయికి తీసుకురావడానికి అందరం ఎంతో కష్టపడ్డాము కానీ దానిని ఇప్పుడు మన చేతులతో మనమే కూల్చివేసుకొంటున్నాము. అందరం కలిసికట్టుగా బయటి శత్రువులతో పోరాడాల్సింది పోయి మనలో మనమే పోరాడుకొంటూ పార్టీని బలహీనరుచుకొని, పార్టీ పరువుప్రతిష్టలు గంగలో కలిపేసుకొంటున్నాము. పార్టీకి నష్టం కలిగిస్తున్నవారు ఎవరో నాకు బాగా తెలుసు. నా సహనాన్ని అలుసుగా తీసుకొని చెలరేగిపోతే ఎంత పెద్దవారైన ఊరుకొను,” అని హెచ్చరించారు. 

కానీ ఈ గొడవలన్నీ తన స్వంత తమ్ముడు, కొడుకు కారణంగానే జరుగుతున్నాయని, పార్టీ నేతలు, శ్రేణులు అందరూ వారి మధ్య చీలిపోయారని కళ్ళకి కట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నప్పుడు, మిగిలిన నేతలపై నేతాజీ చిందులు వేసి ప్రయోజనం ఏమిటి? కనుక ముందుగా వారిద్దరిని క్రమశిక్షణలో పెట్టగలిగితే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. కానీ ఒకరినొకరు బహిరంగంగా తిట్టుకొని, కొట్టుకొనే వరకు పరిస్థితులు వచ్చిన తరువాత వారి మధ్య రాజీ కుదర్చడం, పార్టీని మళ్ళీ గాడిన పెట్టడం సాధ్యమయ్యే పనేనా? అంటే కాదనే అనిపిస్తుంది. 


Related Post