కోదండరాంని తెరాస శత్రువుగా ఎందుకు భావిస్తోందో?

October 24, 2016


img

తెలంగాణా ఉద్యమాలలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర గురించి అందరికీ తెలుసు. ఆ సమయంలో అయన కెసిఆర్ కి కుడిభుజంలాగ వ్యవహరించారు. కానీ తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనని పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కనపడేసి, ఏనాడూ తెలంగాణా ఉద్యమాలలో పాల్గొనని వారిని, తెలంగాణా ఉద్యమాలని వ్యతిరేకించినవారిని చంకనెక్కించుకొంది. అందుకు ఆయన బాధపడి ఉండవచ్చు కానీ ఎన్నడూ బయటపడలేదు. అయితే ప్రభుత్వ పనితీరుని చాలా నిశితంగా గమనిస్తున్న ఆయన, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి వివిధ వర్గాల ప్రజలని స్వయంగా కలుసుకొని వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నాక, వాటిని తెరాస సర్కార్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వాటిని పట్టించుకోవడం లేదు. పైగా అయన వెనుక ఎవరున్నారని ఎదురు ప్రశ్నిస్తోంది. 

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రాజెక్టులని వ్యతిరేకిస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. అవి వాటి రాజకీయ ప్రయోజనాలని మాత్రమే చూసుకొంటున్నాయి తప్ప రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. కానీ రాజకీయలకి అతీతంగా ఉంటున్నానని చెప్పుకొనే ప్రొఫెసర్ కోదండరాం కూడా వాటితో గొంతు కలిపి ప్రాజెక్టులని వ్యతిరేకించడం న్యాయమా? అసలు ఆయన ఎందుకు ప్రాజెక్టులని వ్యతిరేకిస్తున్నారో.. రాష్ట్ర ప్రజల, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మా ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో మాకు అర్ధం కావడం లేదు,” అని అన్నారు.

మంచి రాజకీయ అనుభవజ్ఞుడైన హరీష్ రావుకి ప్రొఫెసర్ కోదండరాం తమ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు పడుతున్నారో తెలియదనుకోలేము. అలాగే ఆయన చెపుతున్న ప్రజల, విద్యార్ధుల, రైతుల సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియదనుకోలేము. 

మిషన్ కాకతీయ చాలా గొప్ప పధకమే. నిజమే..దాని వలననే చెరువులు నిండాయి. కానీ పంటలు పండించుకోవడానికి కేవలం నీళ్ళు ఒకటే ఉంటే సరిపోవు కదా. నాణ్యమైన వితనాలు, కల్తీ లేని ఎరువులు, పురుగుల మందులు, అవి కొనుక్కోవడానికి రైతులకి బ్యాంకుల నుంచి రుణాలు, పంట నష్టానికి పరిహారం వంటివి అవసరం ఉండవా? వాటిని అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ప్రొఫెసర్ కోదండరాం విమర్శిస్తున్నారు. కానీ తెరాస సర్కార్ వాటిని అంగీకరించడం లేదు. తమ ప్రభుత్వం రైతుల కోసం ఇదివరకు ఎవరూ చేయలేనంతగా సహాయసహకారాలు అందిస్తున్నామని వాదిస్తోంది. అది కూడా నిజమే కావచ్చు. 

ప్రభుత్వ వాదనే నిజమే అనుకొన్నట్లయితే, గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్రంలో 134 మంది రైతన్నలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారు? రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ప్రతిపక్షాలు, ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరిస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? పంటరుణాలు మాఫీ చేయాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి చేసే వరకు 3వ దశ పంటరుణాల మాఫీకి ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదు? అనే ప్రశ్నలకి తెరాస సర్కార్ సంతృప్తికరమైన జవాబులు చెప్పుకోవలసి ఉంటుంది.

ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద ఆదివారం జరిగిన రైతు దీక్షకి ప్రొఫెసర్‌ హరగోపాల్‌, చుక్కా రామయ్య, జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రొఫెసర్‌ రమా మెల్కోటే, సీనియర్‌ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, డా.నాగేశ్వర్‌, రామచంద్రమూర్తి, శ్రీనివాసరెడ్డిలు హాజరయ్యి సంఘీభావం తెలిపారంటే అర్ధం ఏమిటి? వారు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టం అవుతోంది కదా. వారితో బాటు మల్లన్నసాగర్‌, ఫార్మాసిటీ, ఫిలింసిటీ నిర్వాసితులు కూడా ఈ దీక్షలో పాల్గొనడం గమనిస్తే తెరాస సర్కార్ పట్ల రైతులలో వ్యతిరేకత ఏర్పడిందనే విషయం స్పష్టం అవుతోంది.  

వారందరూ రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజలు, రైతుల సంక్షేమం కోసమే మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసిఉన్నప్పుడు, వారి మాట వినడానికి ఎందుకు వెనుకాడుతోంది? వారు క్షేత్రస్థాయిలో పర్యటించి కనుగొన్న ప్రజా సమస్యలని తన దృష్టికి తీసుకువస్తుంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాటిని తన దృష్టికి తెస్తున్న ప్రొఫెసర్ కోదండరాంని ఎందుకు శత్రువుగా చూస్తోంది. ఆవిధంగా వ్యవహరించడం వలన చివరికి ఏమవుతుంది? అని ఆలోచిస్తే తెరాస సర్కార్ స్వయంగా ఆయనని కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి బలవంతంగా రప్పించినట్లు అవుతుంది. అదే జరిగితే, మొదట తెరాసయే నష్టపోతుందని కూడా దానికి తెలిసే ఉండాలి. 

కనుక తెరాస సర్కార్ తప్పటడుగులు వేస్తూ తన వాదనలని సమర్ధించుకొనే ప్రయత్నాలు చేయడం కంటే, తన అహాన్ని, భేషజాన్ని, పంతాన్ని పక్కనబెట్టి తమ ప్రభుత్వానికి శ్రేయోభిలాషి వంటి ప్రొఫెసర్ కోదండరాం, చుక్కా రామయ్య వంటి మేధావుల సలహాలని స్వీకరించి లోపాలని సవరించుకొని ముందుకు సాగితే దానికే చాలా గౌరవం పెరుగుతుంది. దానిపట్ల ప్రజలలో నిజంగా ఆదరణ కూడా పెరుగుతుంది కదా. 


Related Post