యూపి రాజకీయాలలో చక్రం తిప్పుతున్న ఆమె?

October 21, 2016


img

ఒకప్పుడు చక్రవర్తులు, రాజుల హయంలో వారి కొడుకుల మద్య రాజ్యాధికారం కోసం ఆధిపత్యపోరు సాగేది. ఒకవేళ రాజుగారికి బహుభార్యలుంటే ఆ పోరు ఇంకా రసవత్తరంగా సాగేది. అది ఎలా సాగేదో అర్ధం చేసుకోవాలంటే బాహుబలి సినిమా చూస్తే సరిపోతుంది. రాజులూ, రాజ్యాలు పోయినా, మన దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో ఇంకా రాజరికపాలనే కొనసాగుతోందని చెప్పకతప్పదు. కిరీటాలు పెట్టుకొని రధాలు మీద ఊరేగడం కనబడదు కానీ మిగిలినదంతా సేమ్ టు సేమ్. రాచరికం పోలేదు కనుక వారసుల మధ్య కీచులాటలు పోలేదు. ఇంకా సాగుతూనే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ప్రతీ రాష్ట్రంలో ప్రతీ రాజకీయ పార్టీలో, ప్రతీ ప్రభుత్వంలో, చివరికి నాయకుల సీట్ల కోసం కూడా వారసత్వ పోరాటాలు కనబడతాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే, యూపిలో కూడా సేమ్ టు సేమ్ ప్రాబ్లం వచ్చి పడింది. ఇంతవరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ ముగ్గురూ కుమ్ములాడుకొంటున్నారని మాత్రమే వార్తలు వినపడ్డాయి. కానీ ఇప్పుడు వారి గొడవల వెనుక ‘థర్డ్ పార్టీ’ కూడా ఉందని తాజా సమాచారం. ఆ పార్టీ ఎవరో కాదు ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య సాధనా గుప్తా యాదవ్! 

ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీలో సభ్యురాలిగా ఉన్న ఆమెతో ములాయం వారికి అనురాగం పెరగడంతో ఒక వర్షం కురుసిన రాత్రి వారు ఒక్కటయ్యారు. ఆ సాన్నిహిత్యం ఇంకా పెరగడంతో వారి ప్రేమకి ప్రతీకగా ‘ప్రతీక్ యాదవ్’ పుట్టాడు. ములాయం సింగ్ మొదటి భార్య చనిపోయిన తరువాత వారి కధ వెలుగులోకి రావడంతో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకతప్పలేదు. ఆ తరువాత ఆమెని ములాయం వివాహం చేసుకొన్నారుట. వారి కుమారుడు ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొంటుంటే, సవతి కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నాడు. ఇంతవరకు జరిగిన కధ చెపుతే ఎవరైనా మిగిలిన కధని ఊహించి చెప్పేయగలరు. 

అందరూ ఊహించినట్లుగానే, ఆమె తన సవతి కొడుకు అఖిలేష్ యాదవ్ ఎదుగుదల చూసి చాలా ఆసూయ పడుతోందిట. అందుకే ఆమె తన మరిది శివపాల్ యాదవ్ తో కలిసి కుట్రలు పన్ని, అఖిలేష్ యాదవ్ ని తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారుట. వారి మాటలు వినే అఖిలేష్ యాదవ్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ములాయం తొలగించేశారుట! ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడానికి ఇష్టపడటం లేదుట! 

ఇలాంటి అనేక ‘టా’లతో  అఖిలేష్ వర్గంలోని ఉదయ్ వీర్ సింగ్ ములాయంవారికి ఒక లేఖ వ్రాశారు. ఆమెని తక్షణం నియంత్రించాలని కోరారుట. అంతటితో ఆగకుండా ములాయం తన పదవి నుంచి తప్పుకొని అఖిలేష్ కి ఆ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారుట. దానిపై పెద్దాయన రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉదయ్ వీర్ సింగ్ మీడియాకి లీక్ చేసిన ఈ లేఖతో యాదవ్ పార్టీలో ముసలం పుట్టడానికి అసలు కారణం ఇదని, ములాయం వారి రెండవ భార్య తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే సంగతి ఇప్పుడు బయటపడింది. 


Related Post