మల్లన్నసాగర్ ప్రాజెక్టు చుట్టూ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పోరాటాలు అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసిపోరాడుతుంటే, తెరాస ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు ఒక్కరే వాటిని ఒంటి చేత్తో ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో నిర్వాసితులతో కూడా మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియని సజావుగా, వేగంగా పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ తెరాస ప్రభుత్వంలో ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు గానీ, తెరాస నేతలు గానీ ఎవరూ ముందుకు వచ్చి ఆయనకి అండగా నిలబడటంలేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కలుగజేసుకోకుండా చూస్తుండి పోవడంతో ఈ వ్యవహారంలో హరీష్ రావుని ఉద్దేశ్యపూర్వకంగానే బలిపశువుగా చేశారని మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆ ఊహాగానాలు నిజమో కాదో తెలియకపోయినా ఈ సమస్యని మరో కోణంలో కూడా చూడవచ్చు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు చుట్టూ అలుముకొన్న రాజకీయాలని హరీష్ రావు ఒంటరిగా ఎదుర్కోవడం చాలా కష్టమైన పనే. అయితే అదే ఆయన శక్తియుక్తులు, సామర్ధ్యం నిరూపించుకొనేందుకు దక్కిన గొప్ప అవకాశంగా కూడా భావించవచ్చు. ఈ అగ్నిపరీక్షలో ఆయన ఉత్తీర్ణులైతే అటు తెరాసలో, ఇటు ప్రభుత్వంలో కూడా ఆయన సత్తా చాటుకొన్నట్లవుతుంది. తద్వారా ఆయన పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కూడా. అప్పుడు ఆయన కెటిఆర్ కంటే చాలా ధీటైన వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలలో తెరాస విజయం సాధించడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు ఏడాదిపాటు అంతర్గతంగా అనేక ఏర్పాట్లు చేసిన తరువాత, ఆ ఎన్నికలలో తెరాస గెలుపు ఖాయమని ఖరారు చేసుకొన్న తరువాతే తెరాసని గెలిపించే బాధ్యత కొడుకుకి అప్పగించారు. ఆ క్రెడిట్ తన కొడుకుకి మాత్రమే దక్కాలనే ఉద్దేశం తోనో లేదా మరొక కారణంతోనో పార్టీలో, ప్రభుత్వంలో మిగిలిన నేతలని ఆ ఎన్నికలకి దూరంగా ఉంచారు. ఊహించినట్లే కెటిఆర్ తెరాసకి ఘనవిజయం సాధించిపెట్టారు. అంటే గ్రేటర్ ఎన్నికల విజయానికి అసలు కారణం కెసిఆర్ చేసిన ముందస్తు ఏర్పాట్లేనని స్పష్టం అవుతోంది.
కానీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో హరీష్ రావుకి అటువంటి ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసిపెట్టలేదు. కనీసం ఇప్పుడైనా ఎవరూ ఆయనకి అండగా నిలబడటం లేదు. అయినా హరీష్ రావు చాలా ధైర్యంగా ఒంటరిపోరాటం చేస్తూ, చాలా చురుకుగా, తెలివిగా పనులు చక్కబెట్టేస్తున్నారు. కనుక ఈ పరీక్ష ఆయనకి లభించిన ఒక అద్భుత అవకాశమే తప్ప దానిలో ఆయన బలిపశువు అయ్యారనడం సమంజసం కాదేమో! ఒకవేళ హరీష్ రావు స్థానంలో వేరొకరు ఎవరైనా మంత్రిగా ఉన్నట్లయితే ఆ విధంగా అనుకోవచ్చేమో గానీ హరీష్ రావు వంటి సమర్ధుడైన నాయకుడి విషయంలో అలా అనుకోలేము. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వ్యవహారంలో అందరినీ ఆయనకి దూరంగా ఉంచినప్పటికీ, దాని వలన హరీష్ రావుకి మేలే జరుగుతుంది తప్ప కీడు జరుగకపోవచ్చు. ఒకవేళ హరీష్ రావు ఈ అగ్నిపరీక్షలో విజయం సాధించి కెటిఆర్ కి ధీటుగా నిలబడితే అప్పుడు కెసిఆర్ అనుకొన్నది ఒకటి, అయ్యింది మరొకటి అన్నట్లవుతుందేమో కూడా!