బతుకమ్మ చీరలతో 20వేల మందికి ఉపాది

June 14, 2019


img

ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు రాష్ట్రంలో పేదమహిళలందరికీ చీరలు పంపిణీ చేయడానికి సిద్దం అవుతోంది. ఈసారి 6.30 కోట్ల మీటర్ల వస్త్రంతో రూ.280 కోట్లు ఖర్చుతో 95 లక్షల చీరలు తయారు చేయించి పంపిణీ చేయబోతోంది. గతంలో బతుకమ్మ చీరల తయారీలేనప్పుడు వారు నెలకు గరిష్టంగా రూ.6-8,000 మాత్రమే సంపాదించుకోగలిగేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 20,000 మంది నేతన్నలు సగటున నెలకు రూ.20,000 చొప్పున సంపాదించుకోగలుగుతున్నారు. చేతినిండా పని, డబ్బుతో నేతన్నల ఇళ్ళు కళకళలాడుతున్నాయిప్పుడు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీలోగా బతుకమ్మ చీరల తయారీ పని పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించడంతో నేతన్నలు క్షణం తీరికలేకుండా చీరల తయారీ పనిలో మునిగిపోయున్నారు. ఈసారి బతుకమ్మ చీరలు నాణ్యతాపరంగానే కాకుండా వెరైటీ డిజైన్లలోతయారవుతున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్దులు 50 రకాల డిజైన్లు రూపొందించారు. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడచులు ఇష్టపడేవిదంగా చీర అంచులు, కొంగు డిజైన్లను రూపొందించారు. ఈసారి బతుకమ్మ చీరలతో పాటు జాకెట్ పీసులు కూడా పంపిణీ చేయబోతున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగానే మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బతుకమ్మ చీరలను తయారుచేస్తున్న సిరిసిల్లా సహకార సంఘాలకు గత ఏడాదిలో నేసిన చీరలకు చెల్లించవలసిన రూ.25 కోట్లు నేటికీ విడుదల కాలేదని తెలుస్తోంది. ఇటువంటి సమస్యలు మొత్తం పధకాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంటుంది.  



Related Post