మన నేతలకు రాచరిక వ్యవస్తే ముద్దు?

June 08, 2019


img

దేశంలో ఎదుటపార్టీలను వేలెత్తి చూపుతూ విమర్శలు, ఆరోపణలు గుప్పించే మన రాజకీయ పార్టీల తీరు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తుంటుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని మూడున్నర దశాబ్ధాల పాటు నిరాటంకంగా ఏలిన సిపిఎం ప్రభుత్వాన్ని మట్టిగరిపించిన మమతా బెనర్జీ, ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని తన సొంత సామ్రాజ్యంగా భావిస్తూ రాష్ట్రంలో బిజెపి అడుగుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   

ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఏదోవిధంగా అస్థిరపరిచి కూల్చివేసి అధికారం చేజిక్కించుకోవాలనే బిజెపి తాపత్రయ పడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించగా, మమతా బెనర్జీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని బిజెపి నేతలు గొప్పగా చెపుతున్నారు. 

అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ఏవిధంగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకొంటున్నారో ఇక్కడ తెలంగాణలో సిఎం కేసీఆర్‌ కూడా అదేవిధంగా చేస్తున్నారని చెప్పవచ్చు. రాష్ట్రంలో తెరాస పార్టీకి, ప్రభుత్వానికి ఎదురే ఉండకూడదనే ఆలోచనతో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొంటున్నారు. 

ఇక ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకొంటూ యావత్ దేశమంతా కాషాయజెండాలు ఎగురవేయాలని కలలు కంటున్న బిజెపి నేతలు, తెలంగాణకు వచ్చేసరికి భిన్నమైన వాదనలు చేస్తుండటం విచిత్రం. రాష్ట్రంలో, అసెంబ్లీలో ప్రతిపక్షమనేది లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యం చేయాలనే ఆలోచనతో సిఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీరావు విమర్శలు గుప్పిస్తుండటం విడ్డూరంగా ఉంది. 

రాజకీయ పార్టీలు ఈవిధంగా పరస్పర విరుద్దమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నాయంటే అధికార కాంక్షతోనే అని చెప్పక తప్పదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, డిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ నేతలందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే రాజరికవ్యవస్థకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు చెప్పవచ్చు. ఎవరికివారు తమ సామ్రాజ్యాలను (రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాలు, వార్డులను) ఏకఛత్రాధిపత్యంగా, శాస్వితంగా, వంశపారంపర్యంగా ఏలుకోవాలని, వీలైతే ఇంకా విస్తరించాలని భావిస్తున్నారు. కానీ తమ సామ్రాజ్యాలలో ఇతరులు ఎవరూ వేలుపెట్టరాదని గట్టిగా కోరుకొంటున్నారు. ఒకవేళ వేలుపెట్టే సూచనలుంటే ముందుగానే అటువంటి శక్తులను నిర్వీర్యం చేయడానికి వెనకాడటం లేదు. కనుక దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల ఎన్నికలు అన్నీ నేతి బీరకాయలో నెయ్యిలాగా మారిపోతున్నాయి. కనుకనే ఎన్నికలను ఒక యుద్దంలా భావిస్తున్న నేతల చేతుల్లో ఇప్పుడు కత్తులు, బాణాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యూహాలు, సేనలు వంటి పదాలు అందరి నోట దొర్లుతున్నాయి. అన్ని పార్టీలలో గజమాలలు, పాలాభిషేకాలతో వ్యక్తి పూజలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. ఈ పరిణామాలన్నీ మన దేశం మళ్ళీ రాజరిక వ్యవస్థవైపుకు అడుగులు వేస్తోందని సూచిస్తున్నాయి.   

(చిత్రం: అమీన్ ఆర్ట్స్ సౌజన్యంతో)


Related Post