తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతోంది అని సామాన్య ప్రజలు ఎవరూ ఇప్పుడు సందేహం వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే రెండేళ్ళలోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడగలిగింది. అందుకు మేమే కారణమని తెరాస..కాదు మేమే కారణమని భాజపా నేతలు వాదించుకోవచ్చు కానీ వారి వాదనలపై సామాన్యులకి ఆసక్తి లేదు.
ప్రస్తుతం రాష్ట్రం లో విద్యుత్ సమస్య లేదు కనుక విద్యుత్ రంగంలో రాష్ట్రం చాలా అభివృద్ధి సాధించినట్లేనని భావిస్తే పొరపాటేనని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసి కో-ఆర్డినేటర్ మరియు తెలంగాణ రాజకీయ జేఏసి సభ్యుడు కె రఘు చెపుతున్నారు. చెప్పడమే కాదు రాష్ట్ర విద్యుత్ రంగంలో లోటుపాట్లని తెలియజేస్తూ “తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతోంది?” అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. దాని ఆవిష్కరణ సందర్భంగా ఆయన చాలా ఆసక్థికరమైన విషయాలు చెప్పారు.
“తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో దామెచర్ల వద్ద ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తోంది. కానీ అక్కడ సమీపంలో ఎటువంటి బొగ్గు గనులు లేవు. సుమారు 300 కిమీ దూరం నుంచి బొగ్గుని తెచ్చుకోవలసి ఉంటుంది. బొగ్గు రవాణా కోసమే ఏటా కనీసం రూ.3,000 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాల సమయంలో బొగ్గు గనులున్న చోటనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మించాలని పోరాడిన మనమే ఇప్పుడు వాటికి దూరంగా ఎందుకు నిర్మించుకొంటున్నామని ప్రశ్నించారు.
“భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు విషయంలో మరో రకం తప్పు జరుగుతోంది. అది సింగరేణి బొగ్గు గనులకి అతి సమీపంలో ఉంది కనుక దానికి ఈ సమస్య ఉండదు. కానీ భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ కి విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న బొగ్గుని 50 నుంచి 100 శాతం వరకు వాడాలని నిర్ణయించారు. ఎందుకు? దాని వలన ఏడాదికి రూ.400 కోట్లు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఖర్చు చేయగలిగితే, విద్యుత్ రంగంలో తాత్కాలిక ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేయవచ్చు కదా?” అని రఘు ప్రశ్నించారు.
“యాదాద్రి విద్యుత్ కేంద్రం, ఖమ్మం జిల్లాలో మునుగూరు వద్ద నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రం రెండూ కూడా అవుట్-డేటడ్ (చాలా పాత సాంకేతిక పరిజ్ఞానం)తో నిర్మిస్తున్నారు. వాటివలన కూడా నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు,” అని అన్నారు.
“ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందం చేసుకోవడం వలన మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని పూర్తి గణాంకాలతో సహా నేను ఉన్నతాధికారులకి వివరించాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ విద్యుత్ రంగంలో ఉన్న ఇటువంటి లోటుపాట్లు గురించి సామాన్య ప్రజలకి కూడా తెలియాలనే నేను ఈ పుస్తకాన్ని రచించాను తప్ప ఎవరినో వేలెత్తి చూపాలనే ఉద్దేశ్యంతో కాదు. విద్యుత్ రంగం ఇప్పటికే తీవ్ర నష్టాలలో ఉంది. అందుకు అనేక కారణాలు కనబడుతున్నాయి. వాటిని సవరించుకోవలసిన అవసరం ఉంది,” అని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ సంస్థ ప్రతినిధి ఎన్.ఐ.ఏ. శ్రీకుమార్ మాట్లాడుతూ “2016-17 సం.లని దేశంలో మిగులు విద్యుత్ సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మిగులు విద్యుత్ కారణంగా దేశంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల మధ్య పోటీ పడి విద్యుత్ ధరలు తగ్గించవలసి వస్తోంది. ఆ కారణంగా అనేక సంస్థలు తీవ్ర నష్టాలపాలవుతున్నాయి. కనుక ఇటువంటి సమయంలో తెలంగాణలో కొత్తగా అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు స్థాపించడం అవసరమా? కాదా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది,” అని అన్నారు.
వారిరువురూ విద్యుత్ రంగంలోని వారే కనుక వారు ఆ రంగంలో తప్పొప్పుల గురించి చెపుతున్న మాటల్ని కొట్టి పడేయలేము. అయితే, ఇటువంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని నిర్మిస్తోంది అంటే నమ్మలేము. కనుక ఈ రంగంలో నిపుణులే ఇటువంటి సమస్యలున్నట్లయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడం మంచిది.