ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తధ్యమే...నా?

May 31, 2019


img

జాతీయస్థాయిలో కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికి పూర్తి మెజార్టీ లభించదనే ఊహాజనితమైన ఆలోచన నుంచి పుట్టుకువచ్చిందే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని చెప్పవచ్చు. కానీ సిఎం కేసీఆర్‌ అంచనాలకు భిన్నంగా బిజెపి భారీ మెజార్టీతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌ ఇంక అటకెక్కించేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ నేటికీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన ఆచరణ యోగ్యమేమని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్న మాటలను తేలికగా కొట్టిపడేయలేము.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలో చక్రం తిప్పేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తెరపైకి తెస్తే, ఇప్పుడు బిజెపి బారి నుంచి తమ పార్టీలను, ప్రభుత్వాలను కాపాడుకొనేందుకు దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఫెడరల్‌ ఫ్రంట్‌ గొడుగు క్రిందకు చేరవలసిన అవసరం కనిపిస్తోంది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలకు విస్తరించిన బిజెపి, ఇప్పుడు పశ్చిమబెంగాల్, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు సిద్దం అవుతున్న నేపధ్యంలో  బిజెపియేతర పార్టీలు, ప్రభుత్వాలు ఐకమత్యంగా ఉండలేకపోతే వాటి మనుగడ కష్టం కావచ్చు.

ముఖ్యంగా తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పదేపదే నొక్కి చెపుతున్నారు కనుక ఇకపై బిజెపి పట్ల తెరాస మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొని ఉంది కనుక తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొన్న డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌, జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనే వంకతో విజయవాడకు వచ్చి సిఎం కేసీఆర్‌తో మంతనాలు చేసి ఉండవచ్చు. ప్రమాణస్వీకారం తరువాత తాడేపల్లిలో జగన్ నివాసంలో భోజన సమావేశం జరిగింది.

కనుక త్వరలోనే సిఎం కేసీఆర్‌ మళ్ళీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు లేదా బిజెపియేతర ప్రాంతీయ పార్టీలతో కలిసి జాతీయపార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి దెబ్బకు డీలా పడిపోయిన ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్‌ ప్రతిపాదనకు ఈసారి ‘సై’ అనవచ్చు. 


Related Post