రైతుపై విరిగిన లాఠీ.. ఏమంటోంది కేసీఆర్..?

July 25, 2016


img

దొరల నుండి దోపిడీదారుల నుండి తెలంగాణ తల్లికి విముక్తి కలిగింది. ఆంధ్రాపాలకుల కుట్రల నుండి, తెలంగాణ అవనికపై చేసిన కుతంత్రాల నుండి ఊరటలిభించింది. మన తెలంగాణ మనకు లభించింది అని సంబురాలు చేసుకున్నాం. నాడు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఓ మహాత్ముడు చెప్పిన ఓ మాట ‘అప్పుడు తెల్లవాడు దొరతనం, దగా చేసే వాడు ఇప్పుుడు మనవాడు, నల్లవాడు అదే చేస్తున్నాడు’ అని. ఇప్పుడు దీనిని కేసీఆర్ కు ఆపాదించాలేమో. ఎందుకంటే కేసీఆర్ వైఖరిలో వచ్చిన మార్పు.. అధికారంలోకి రాగానే వచ్చిన అహంకారమో కానీ రైతుల మీద లాఠీ విరిగింది. సేద్యం కోసం స్వేదం చిందించే రైతలన్నపై పోలీసులు కర్కశంగా లాఠీలు ఝులిపించారు. 

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ అన్నారు, తర్వాత హరిత తెలంగాణ అన్నారు, అయినా రైతుల సంక్షేమం లేని తెలంగాణ మాత్రం ఎవరూ కొరుకోరు. ప్రభుత్వం అన్నాక ఖచ్చితంగా విమర్శలు, వ్యతిరేకతను ఎదురుకోవాల్సి వస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఆ రెండింటికి సిద్ధంగా లేదు. అందుకే నయానో భయానో ప్రభుత్వ వ్యతిరేకతను అణగదొక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. చమట చిందే ఆ నేల రక్తం చిందింది. 

50 రోజులుగా మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులు చేస్తున్న ఆందోళనను పట్టించుకోని టీఆర్‌ఎస్‌ సర్కారు, వారిపై ఆదివారం ఉక్కుపాదం మోపింది. శాంతియుత ఉద్యమానికి దిగిన వందలాది మంది రైతులు, మహిళలపై లాఠీచార్జి చేసింది. భయకంపితులను చేసేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. తద్వారా తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నిర్వాసితులపై ఒకేరోజు రెండు పర్యాయాలుగా కర్కశంగా వ్యవహరించింది. ఉదయం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఒకసారి, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మరోసారి పోలీసులు తమ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. రెండు సందర్భాల్లో మూడు సార్లు లాఠీచార్జి చేశారు.

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు వ్యతిరేకంగా 50 రోజుల నుంచి భూనిర్వాసితులు ఆందోళనకు పూనుకున్నారు. జీవో 123ను రద్దు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులు, మహిళలు వందలాదిగా రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 12 గంటల నుంచే ఇది ప్రారంభమైంది. ఒంటిగంటలోపు ఎర్రవల్లి సమీపంలో ఒకసారి లాఠీచార్జి చేశారు. సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కాల్పులు జరిపారు. మొత్తంగా మూడుమార్లు నిర్వాసితులపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేశారు.

కాగా ప్రభుత్వం చేసిన నిర్వాకం మీద మంత్రి హరీష్ రావు స్పందన భిన్నంగా ఉంది. వేములఘాట్‌లో నిర్వాసితులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని రాష్ట్ర భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆరోపించారు. నిర్వాసితులకు అన్యాయం జరగనీయబోమని చెప్పారు. ప్రతిపక్షాల కుట్రలో ప్రజలు భాగస్వాములు కారాదన్నారు. అయినా కుట్రలు, కుతంత్రాలు కాదు కావాల్సింది న్యాయం. కానీ తెలంగాణ ప్రభుత్వం దాన్ని కాకుండా మసిపూసి మారేడు కాయను చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే కేసీఆర్, హరీష్ రావులు ఎంత ఇంద్రజాలం చేసినా కానీ వాళ్ల ట్రిక్కులు మల్లన్నసాగర్ బాధితులపై చేసిన లాఠీ దెబ్బలను మాన్పలేవు.


Related Post