ఎన్ని స్లాబులు ఉంటే ఏమి లాభం?

August 04, 2018


img

జి.ఎస్.టి.లో ప్రస్తుతం ఉన్న5,12,18,28 నాలుగు స్లాబుల స్థానంలో 5,15,25శాతం స్లాబులు మాత్రమే ఉండేవిధంగా మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు భారత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఆర్ధికశాఖ సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలియజేశారు. తద్వారా అనేక వస్తువులు, సేవలు 15 శాతం స్లాబులోకి వస్తాయి కనుక ప్రజలకు మరింత ఉపశమనం లభిస్తుందని అన్నారు. 

జి.ఎస్.టి. అమలులోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది కానీ ఇంతవరకు కూడా వ్యాపారసంస్థలు జి.ఎస్.టి.పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తూనే ఉన్నాయి. పాలు, బియ్యం వంటి వస్తువులను జి.ఎస్.టి.నుంచి పూర్తిగా మినహాయించినప్పటికీ, బ్రాండెడ్ ఉత్పత్తులపై జి.ఎస్.టి. వసూలు చేసుకొనే వెసులుబాటు ఉన్నందున వాటిపై జి.ఎస్.టి. వసూలు చేస్తున్నారు. 

పోనీ జి.ఎస్.టి. పేరు చెప్పి వసూలు చేస్తున్న సొమ్ము నూటికి నూరు శాతం కేంద్రప్రభుత్వ ఖజానాకు చేరుతున్నా ప్రజలు సంతోషించేవారు. తాము కడుతున్న పన్నులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయని సర్దిచెప్పుకొనేవారు. కానీ జి.ఎస్.టి. వలన ఇటు ప్రజలపై పన్ను భారం ఏమాత్రం తగ్గలేదు. అటు కేంద్రానికి ఆశించినంత ఆదాయం లభించడంలేదు. ఎందుకంటే జి.ఎస్.టి. అమలులోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్లో కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు దుఖాణదారులు ‘జి.ఎస్.టి. బిల్లు కావాలా లేక మామూలు బిల్లు కావాలా?’ అని అడుగుతుండటం బహుశః అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. 

‘జి.ఎస్.టి.లేని బిల్లు’ అంటే అర్ధం ఏమిటి? జి.ఎస్.టి. పరిధిలోకి రాకుండా వస్తువులు ఏవిధంగా మార్కెట్లోకి వస్తున్నాయి? ఏవిధంగా అమ్ముడు అవుతున్నాయి?వాటి అసలు విలువ ఎంత? వాటిపై లాభం ఎంత?అది ఎవరి ఖాతాలో జమా అవుతుంది?అనే సందేహాలు కలుగకమానవు. జి.ఎస్.టి.లో ఇన్ని లొసుగులున్నాయనే సంగతి పాలకులకు, వాణిజ్య పన్నుల శాఖల అధికారులకు తెలియదా? అనే సందేహం కలుగుతుంది. 

ఒకవేళ సంజీవ్ సన్యాల్ చెప్పినట్లు 5,15,25శాతం స్లాబులు ఏర్పాటు చేస్తే 12 శాతం స్లాబులో ఉన్న వస్తువులు 15శాతం స్లాబులోకి మారుతాయి కనుక సామాన్యులపై ఇంకా పన్నుభారం ఇంకా పెరుగుతుంది. సామాన్యులపై పన్ను భారం పెంచుతూ మరోపక్క 28 శాతం స్లాబులోకి ఉన్నతాదాయవర్గాలు కొనుగోలు చేసే విలాసవంతమైన వస్తువులు, సేవలపై జి.ఎస్.టి. స్లాబును 25శాతానికి తగ్గించాలనే ఆలోచన ఎందుకో అర్ధం కాదు. సామాన్య ప్రజలపై పన్ను భారం మరింత పెంచడానికే కేంద్రం ఈ స్లాబులను సవరించాలనుకొంటోందా? 


Related Post