హైదరాబాద్‌లో ఎన్ని రకాల ప్రయాణ సాధనాలున్నా అన్నీ జనంతోనే కిటకిటలాడుతూనే ఉంటాయి. నగరంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నందున నానాటికీ నగర జనాభా పెరిగిపోతుండటం వలననే మెట్రోరైళ్ళు, బస్సులు అన్ని ఇంత రద్దీగా ఉంటాయి. నగర ప్రజల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచికొని టిజిఎస్‌ఆర్టీసీ కొత్తగా 8 మెట్రో బస్ సర్వీసులను సోమవారం నుంచి ప్రారంభించబోతోంది.
ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి వయా ఏస్ రావు నగర్, సైనిక్ పురీ, షాపింగ్ కాంప్లెక్స్, అమ్ముగూడ, నాగ దేవత గుడి, లాల్ బజార్, ఖార్ఖానా, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ వరకు (రూట్ నంబర్: 24E) ఈ మెట్రో బస్ సర్వీసులు నడుస్తాయి.
ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి ప్రతీరోజూ ఉదయం 5.35 గంటలకు మొదటి బస్సు, రాత్రి 9.07 గంటలకు చివరి బస్ బయలుదేరుతుంది. అదేవిదంగా సికింద్రాబాద్ నుంచి ప్రతీరోజూ ఉదయం 6.30 గంటలకు మొదటి బస్సు, రాత్రి 8.52 గంటలకు చివరి బస్ బయలుదేరుతుంది. ఈ మార్గంలో ప్రతీ 13 నిమిషాలకు ఒక బస్సు చొప్పున మొత్తం 8 బస్సులు తిరుగుతుంటాయని టిజిఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.