భారత్‌లో అమెజాన్ ఎయిర్ కార్గో సేవలు షురూ!

January 23, 2023
img

ప్రపంచంలో ఈ కామర్స్ సంస్థలలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ భారత్‌లో కూడా నంబర్ 1 స్థానంలోనే ఉంది. అమెజాన్ సంస్థకి దేశంలో 11 లక్షల మందికి పైగా వినియోగదారులున్నారు. కనుక మరింత వేగంగా వారు కొనుగోలు చేసిన సామాను చేరవేసేందుకు తొలిసారిగా అమెజాన్ ప్రైమ్ ఎయిర్ పేరుతో కార్గో సర్వీసుని ప్రవేశపెట్టింది.

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సర్వీసులని ప్రారంభించారు. ఇప్పటివరకు అమెజాన్ సంస్థ అమెరికా, యూకేలో మాత్రమే ఈ అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో సర్వీసులని నిర్వహిస్తోంది. తొలిసారిగా భారత్‌లో నేటి నుంచి ప్రారంభించింది. 

ముందుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల మద్య ఈ అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో సర్వీసుతో వివిద ఉత్పత్తులని రవాణా చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని కోసం అమెజాన్ సంస్థ బెంగళూరుకి చెందిన క్విక్ జెట్ అనే విమాయణ సంస్థతో ఒప్పందం చేసుకొని బోయింగ్ 737,800 విమానాలని వినియోగించుకోబోతోంది.

హైదరాబాద్‌లో ఇప్పటికే అతిపెద్ద అమెజాన్ కార్యాలయం, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్, డేటా సెంటర్‌ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ కేంద్రంగా ఈ అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కూడా ప్రారంభమైంది. అమెజాన్ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాలకి హైదరాబాద్‌ని కేంద్రంగా ఎంచుకొంటున్నందుకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

  


Related Post