విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల నిర్వహణతో వస్తున్న సమస్యలు, విమర్శలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇకపై అటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నిషేధం విధించాలని భావిస్తోంది. క్యాంపస్‌లను విద్యా, క్రీడా కార్యక్రమాలకే పరిమితం చేయాలని యోచిస్తోంది. విద్యార్థుల చదువులకు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తోంది.
ఇటీవల ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్ల కోసం మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను పెద్ద సంఖ్యలో తరలించడం, విద్యార్ధులు ఆ సినిమా చూసేందుకు సెలవు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సదరు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న సినిమా మరియు ఇతర వేడుకల్లో ప్రమాదాలు జరిగి విద్యార్ధులు గాయపడటం లేదా చనిపోవడం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది.
అయితే విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే చిన్నపాటి సాంస్కృతిక, కళా, క్రీడా కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.