డొనాల్డ్ ట్రంప్‌ అహ్మదాబాద్ పర్యటన హైలైట్స్

February 24, 2020


img

భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్‌లకు స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ పక్కన బెట్టి ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వారి విమానం వద్దకు వెళ్లారు. ట్రంప్‌ను ఆప్యాయంగా కౌగలించుకొని మెలానియాకు షేక్ హ్యాండిచ్చి స్వాగతం పలికారు. డొనాల్డ్ ట్రంప్ నల్లసూటు, పసుపు రంగు టై ధరించగా, మెలానియా ట్రంప్ తెల్లటి దుస్తులు ధరించి వచ్చారు. 



ట్రంప్ దంపతులు విమానం దిగి రెడ్ కార్పెట్ నడిచివస్తుండగా వారికి గుజరాతీ కళాకారులు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సబర్మతీ ఆశ్రమం వరకు 22 కిమీ దారిపొడవునా ప్రజలు భారత్‌, అమెరికా జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. దారిలో ప్రధాన కూడళ్ళవద్ద వివిద రాష్ట్రాల సంస్కృతీ సాంప్రదాయాలను తెలియజేసేవిధంగా కళాకారులు కళాప్రదర్శనలు చేస్తూ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. 


విమానాశ్రయం నుంచి సబర్మతీ ఆశ్రమం చేరుకొన్న ట్రంప్ దంపతులను ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా తోడ్కొని జాతిపిత మహాత్మాగాంధీజీ నివసించిన ఆ ఆశ్రమాన్ని చూపించారు. స్వాతంత్ర పోరాటంలో ఖాదీవస్త్రాలు ఏవిధంగా దేశప్రజల మద్య ఐక్యత పెంచి, చైతన్య పరిచాయో ప్రధాని మోడీ వివరిస్తున్నప్పుడు చాలా ఆసక్తిగా విన్న ట్రంప్ దంపతులు అక్కడే ఉన్న రాట్నంపై కాసేపు నూలు వడికారు. ఈ సందర్భంగా ట్రంప్ క్రిందన కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించారు. 

సబర్మతీ ఆశ్రమం సందర్శన తరువాత వారికి ‘చెడు వినకూ..చెడు మాట్లాడకు..చెడు చూడకు..’ అని సూచించే మూడు కోతుల బొమ్మల గురించి ప్రధాని మోడీ వారికి వివరించి వాటిని బహుకరించారు 

అనంతరం అతిధుల పుస్తకంలో “గొప్ప స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీ...ఈ అద్భుతమైన పర్యటనకు కృతజ్ఞతలు..” అని వ్రాసి ట్రంప్ దంపతులిరువురూ సంతకాలు చేశారు. 


అక్కడి నుంచి మోతెరా క్రికెట్ స్టేడియం చేరుకొన్న ట్రంప్ దంపతులకు అక్కడ వేచి చూస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్ షాను ప్రధాని నరేంద్రమోడీ పరిచయం చేశారు. మోతెరా క్రికెట్ స్టేడియంలో లక్షమందికి పైగా ప్రజలు హర్షధ్వానాలతో ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అంత పెద్ద స్టేడియంలో ఇసుక వేస్తే కింద రాలనంతగా నిండిపోయిన జనాలను  చూసి ట్రంప్ ఉబ్బితబ్బిబైనట్లు కనిపించారు. 

ఇవాంకా ట్రంప్‌ స్టేడియంలో ప్రవేశించినప్పుడు కూడా ప్రజలు హర్షధ్వనలతో స్వాగతం పలకడంతో ఆమె చాలా ఆనందంతో చిర్నవ్వులు చిందించారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు కొందరు దగ్గరకు రాగా ఆమె ఏమాత్రం విసుక్కోకుండాచిర్నవ్వులు చిందిస్తూ వారితో సెల్ఫీలు దిగడం విశేషం.


మోతెరా స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రజలనుద్దెశ్యించి ప్రసంగిస్తూ, “రెండేళ్ళ క్రితం హైదరాబాద్‌ వచ్చిన ఇవాంకా ట్రంప్‌ మళ్ళీ మరోసారి తప్పకుండా భారత్‌ పర్యటనకు వస్తానని అన్నారు. ఆమె తన మాట నిలబెట్టుకొంటూ ఈసారి భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి మళ్ళీ భారత్‌ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి అయినప్పటికీ చాలా నిరాడంబరంగా మీడియాకు దూరంగా ఉంటారు,” అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఆమెపై ప్రశంశల వర్షం కురిపించారు.


Related Post