చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ పనులకు శంఖుస్థాపన

February 19, 2020


img

రైల్వేమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ పనులకు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టబోతున్న మరికొన్ని రైల్వే ప్రాజెక్టు పనులను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ప్రారంభించారు. వాటి వివరాలు... 

1. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న మూడు ప్లాట్‌ఫామ్‌లను ఆరు ప్లాట్‌ఫామ్‌లకు విస్తరించనున్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వాటిని హై లెవెల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లుగా నిర్మించబోతున్నారు. 

2. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లలో ఆరు ఎస్కలేటర్లను, తొమ్మిది లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. 

3.  చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు కొత్త రైల్వే స్టేషన్ భవనం నిర్మించనున్నారు. 

4. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు కొత్తగా అప్రోచ్ రోడ్డును నిర్మిస్తారు. 

5. రూ.221 కోట్లు వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరశివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఈ విస్తరణ పనులు పూర్తయితే ఆ ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలు చర్లపల్లి స్టేషన్‌నే వినియోగించుకొంటారు కనుక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రోజుకు 50-60 రైళ్లు ప్రయాణిస్తాయి. కనుక రోజుకు కనీసం లక్షమంది ఆ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే చర్లపల్లి మీదుగా ప్రైవేట్ రైళ్ళ రాకపోకలు మొదలవుతాయని మంత్రి తెలిపారు. 

6. రూ.112 కోట్లు వ్యయంతో ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్‌లో 123 కిమీ పొడవునా విద్యుదీకరణకు పనులను మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. 

7. గుంతకల్లు–కల్లూరు మద్య 41 కిమీ పొడవుండే రెండవ లైన్‌ నిర్మాణ పనులు, విద్యుదీకరణ పనులు పూర్తయినందున ఆ మార్గాన్ని జాతికి అంకితం చేశారు. కనుక ఇక నుంచి ఆ మార్గంలో రైళ్ళ రాకపోకలు మొదలవుతాయి. దీంతో డిల్లీ, ముంబై, సికింద్రాబాద్‌ స్టేషన్ల మద్య రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించే అవకాశం కలిగింది. కనుక ప్రయాణ సమయం కూడా కొద్దిగా తగ్గనుంది.


Related Post