మహా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మళ్ళీ సిద్దం

November 15, 2019


img

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో కాంగ్రెస్‌, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకాబోతోంది. ముఖ్యమంత్రి, మంత్రిపదవులపై మూడు పార్టీల మద్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. శివసేన కోరుకొన్నట్లుగానే 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవి దానికే అప్పగించి కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో ఉప ముఖ్యమంత్రి పదవీ తీసుకొనేందుకు అంగీకరించాయి. అలాగే శివసేన, ఎన్సీపీలు చెరో 14, కాంగ్రెస్‌ 12 మంత్రి పదవులు పంచుకొనేందుకు మూడు పార్టీల మద్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబందించిన 40 అంశాలపై ఉమ్మడి ప్రణాళికపై మూడు పార్టీలు ఒక అవగాహన కుదుర్చుకొన్నట్లు తెలుస్తోంది.  

కనుక శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మూడు పార్టీల ప్రతినిధులు కలిసి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఆయనకు సమర్పించనున్నారు. 

ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ళు పంచుకొందామనే శివసేన ప్రతిపాదనకు బిజెపి అంగీకరించి ఉండి ఉంటే నేడు అధికారంలో ఉండేది. కానీ శివసేనకు బద్ద విరోధులైన కాంగ్రెస్‌, ఎన్సీపీలు ఎట్టి పరిస్థితులలో దానికి మద్దతు ఈయవని, శివసేనకు బిజెపి తప్ప మరో దారిలేదనే గుడ్డి నమ్మకంతో బిజెపి పంతానికిపోయి చేతికి అందివచ్చిన అధికారాన్ని  కోల్పోయింది. 

ఇప్పుడు అధికారం చేపట్టబోతున్న శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు రాబోయే ఐదేళ్ళలో మహారాష్ట్రలో తమతమ పార్టీలను మరింత బలోపేతం చేసుకోవడం ఖాయం. కనుక వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో...ఆ మూడు పార్టీలలో  ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వాటిని ఎదుర్కొని అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి కష్టమేకావచ్చు. అంటే బిజెపి వేసిన ఒక తప్పటడుగుకు చాలా భారీ మూల్యం చెల్లిస్తోందన్న మాట! 


Related Post