మున్సిపల్ ఎన్నికలు వాయిదా?

July 19, 2019


img

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తొందరపడుతుంటే, మరోవైపు రిజర్వేషన్లు, వార్డుల విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో వరుసగా పిటిషన్లు పడుతుండటం విశేషం. తత్ఫలితంగా ఇప్పటికే మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విదించింది. తాజాగా మరో 10 మున్సిపాలిటీలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసులను వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. 

ఈ ఎన్నికల ఏర్పాట్లపై గతంలో సింగిల్ జడ్జికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని, జడ్జి సూచనలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులలో హడావుడిగా ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతుండటాన్ని ప్రశ్నిస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన కె.అంజూన్ కుమార్ రెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం దానిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘమే ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్‌ వేయడం ఎక్కడా చూడలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణకు 119 రోజులు గడువు ఉన్నప్పటికీ, ఏర్పాట్లు పూర్తిచేయకుండా, అభ్యంతరాలను పరిష్కరించకుండా ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 

అయితే ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అభ్యంతరాలన్నీ పరిష్కరించిన తరువాతే ఎన్నికలు నిర్వహిస్తామని అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు న్యాయస్థానానికి తెలిపారు. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలనుకోవడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది జి.విద్యాసాగర్‌ చెప్పారు. ఈ తాజా హామీని కూడా హైకోర్టు రికార్డు చేసుకొంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ నేపద్యంలో మున్సిపల్ ఎన్నికలు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


Related Post