తెలంగాణలో కేసీఆర్‌ తిరగొద్దా? కేటిఆర్‌ ప్రశ్న

December 05, 2018


img

తెరాస అభ్యర్ధులకు మద్దతుగా మంత్రి కేటిఆర్‌ మంగళవారం ఖమ్మం, పాలేరు, నర్సంపేట, సనత్‌నగర్‌ నియోజకవర్గాలలో అభ్యర్ధులతో కలిసి రోడ్-షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌రెడ్డి అరెస్టుపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే దేశంలో ఎక్కడెక్కడి నుంచో ముఖ్యమంత్రులు వచ్చి ఎన్నికల ప్రచారం చేసుకొంటారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొడంగల్‌లో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వీలులేదా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌కు కొడంగల్‌లో ప్రవేశించడానికి వీలులేదా? ఇదెక్కడి న్యాయం?ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి. అతను సిఎం కేసీఆర్‌ను కొడంగల్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకొంటానని అంటుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయశాము. మా ఫిర్యాదు సహేతుకంగానే ఉన్నందున ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించింది. రేవంత్‌రెడ్డి చిల్లర వేషాలు వేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈసారి మా తెరాస అభ్యర్ధి చేతిలో ఓటమి తప్పదు,” అని అన్నారు. 



Related Post